మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jan 31,2024 23:08

అమలాపురంలో జరిగి సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి

ప్రజాశక్తి-అమలాపురం

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా సమావేశం బుధవారం అమలాపురం బాలుర హై స్కూల్‌ ఆవరణంలో కె.సత్యవేణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కృష్ణవేణి మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని వేతనాలు పెంచుతామని అనేక హామీలిచ్చి మాట తప్పారన్నారు. ఒకపక్క నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయని ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. అలాగే పెండింగ్‌ ఉన్న బిల్లులు చెల్లించాలన్నారు. గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. హై స్కూల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఇవ్వాలన్నారు. యూనిఫామ్‌ ఇవ్వాలని రెండు నెలలకు ఒకసారి వర్కర్లతో మండల విద్యాశాఖ అధికారి సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు మట్టి .ఖర్చులు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం నాయకులు కె.సత్యవేణి, శీలం మంగాదేవి, బొంతు బేబీ, జి.వరలక్ష్మి, పి.లక్ష్మీదేవి, కె.మహాలక్ష్మి, పార్వతి. కనక దుర్గ, కె.బేబీ తదితరులు పాల్గొన్నారు.

 

➡️