Train Accident : రైలు ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.10 లక్షలు నష్టపరిహారం

న్యూఢిల్లీ : సోమవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలను, న్యూజల్‌పారు గుడి జంక్షన్‌ సమీపంలోని రంగపాని స్టేషన్‌ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు బలంగా ఢకొీట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు బోగీలు గాల్లోకి తేలాయి. గూడ్స్‌ రైలు బోగీలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా. 60 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన బాధితులకు రూ. 50 వేలు పరిహారం నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️