మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 19,2024 22:41
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. సోమవారం ఈదరపల్లిలో రూ.43.60 లక్షల నరేగా నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం-1 భవనాన్ని, రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం-2 భవనాలను, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్‌ నగర్‌లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. వన్నెచింతలపూడిలో రెండు వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చిందన్నారు. సుపరిపాలన అందించే దిశగా సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను నిర్మించి ప్రజలకు ఆయా సేవలను చేరువ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మానస పుత్రిక గ్రామ సచివాలయ వ్యవస్థకు భవనాలు అందుబాటులో తెస్తున్నట్టు చెప్పారు. తాగునీటి వసతులు మెరుగు పరిచే దిశగా మరిన్ని వాటర్‌ ట్యాంకులను అందుబాటులో తెచ్చి తాగునీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి పందిరి శ్రీహరి రామ్‌ గోపాల్‌, ఎఎంసి చైర్మన్‌ దంగేటి డోలామణి రుద్ర, సర్పంచ్‌ రాయుడు వరలక్ష్మి పాల్గొన్నారు.

➡️