నిబంధనలకు భంగం కలిగిస్తే చర్యలు

May 26,2024 22:37

మడికి సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌ఐ శ్రీను నాయక్‌

ప్రజాశక్తి-ఆలమూరు

ఎవరైనా ఎన్ని కల నిబంధనలకు, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ ఎల్‌.శ్రీను నాయక్‌ అన్నారు. మండలంలోని మడికి శివారు నాగులపేటలో ఆదివారం ఆయన స్థానిక ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిందన్నారు. ఇక ఇప్పుడు కౌంటింగ్‌ ప్రక్రియపై అందరి దష్టి నెలకొందన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అయితే ప్రజలు ఎవరికివారు స్వేచ్చగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోల్‌ ఫలితాల కోసం చర్చలు, వాదనలు, బెట్టింగులు మంచి పద్ధతి కాదన్నారు. గెలిచేది తామే అని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు అంటున్నా వాటిలో తల దూర్చ వద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సోషల్‌ మీడియాలలో తమ పార్టీయే గెలుపొందుతుందనే వాదనలు వినిపిస్తున్నాయన్నారు. ఈ వాదనలతో అనేక అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే గ్రూప్‌ అడ్మిన్‌ లపై ప్రత్యేక కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ రోజున జరిగిన చిన్నపాటి అల్లర్లను రేపుతూ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో ప్రత్యేక ప్రదేశాల్లో గ్రూప్‌ రాజకీయాలు నిర్వహించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పై విధంగా నడుచుకుని మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఎస్‌ఐ శ్రీను నాయక్‌ సూచించారు.

 

➡️