గుడ్డు ధరలు ఢమాల్‌

Apr 8,2024 22:40
గుడ్డు ధరలు ఢమాల్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఒక వైపు ప్రభుత్వ సహకారం లేక, మరో వైపు దళారులు చక్రం తిప్పడంతో కోడి గుడ్ల రైతులు నష్టాల బాట పడుతున్నారు. గత నెలలో రైతు ధర రూ.5 కాగా ఈ నెలలో రూ.4.15కు చేరింది. రిటైల్‌ ధర రూ.6 నుంచి రూ.5 చొప్పన విక్రయాలు జరుగుతున్నాయి. కోళ్ల ఫారాలు అద్దెకు తీసుకోవడంతో మొదలై కోడి పిల్లల కొనుగోలు, మేత, విద్యుత్‌ తదితర ఖర్చులకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా ఆదాయం లభించడం లేదనే ఆవేదన అత్యధిక మందిలో వ్యక్తమవుతోంది. దళారీ వ్యవస్థకు అడ్డు లేకపోవడంతో ఆరుగాలం కష్టం చేసిన రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదు. కానీ గుడ్లు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌కు ఎగుమతులు చేసే దళారులు మాత్రం ఆఫీసుల్లో కూర్చొని లాభాలు గడిస్తున్నారు. గుడ్లు లోడింగ్‌ అయిన తరువాత నాలుగు రోజులకు వాళ్ల ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తే దానికి రైతులు కట్టుబడి ఉండాల్సిందే. కనీసం మిగులు సంగతి ఎలా ఉన్నా గిట్టుబాటు ధర కూడా రాని సందర్భాలను రైతులు ఎదుర్కొంటున్నారు. గుడ్లు కొనుగోలు చేయడంలో ప్రధానంగా ట్రేడర్స్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పౌల్ట్రీలలో ఉత్పత్తి అయిన గుడ్లను ట్రేడర్స్‌ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన గుడ్లకు మాత్రం కనీసం ధర మాత్రం చెప్పరు. రైతుల వద్ద గుడ్డు కొన్నప్పుడు కనీస ధర విషయం మాట్లాడిన దాఖలాలు ఉండవు. నాలుగు రోజుల తర్వాత ట్రేడర్‌ వద్ద ఇంత అని చెబితే దాన్ని మహాప్రసాదంలా స్వీకరించాలే తప్ప ప్రశ్నించే పరిస్థితులు లేవు.ఉమ్మడి జిల్లాలో 40 వేల మందికి ఉపాధిపౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఉమ్మడి జిల్లాలో 40 వేల మందికి ఉపాధి లభిస్తోంది. సుమారు 300కు పైగా పౌల్ట్రీలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం గుడ్డు ధర 4.15 పైసలు ఉండగా కమీషన్లు పోను రైతుకు 4.06 పైసలు మాత్రమే అందుతోంది. కనీసం రైతులకు రూ.5.00 ధర లభిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. గుడ్ల అమ్మకాలకు ప్రత్యేంగా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా రైతులు కోరుతున్నారు. కొన్ని పంటలకు పత్తి, పొగాకు, పసుపులకు బోర్డులు ఏర్పాటు మాదిరిగానే, పౌల్ట్రీ పరిశ్రమకు ధరల నియంత్రణ కోసం ఏర్పాటు చేయాలి. దీనివల్ల రైతులకు వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రభత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కోడిగుడ్లు తక్కువ ధరకు ప్రజలకు అందజేసే అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నారు. ఫలితంగా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతులకు, ప్రజలకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయి. చక్రం తిప్పుతున్న దళారులుగుడ్ల ఎగుమతుల్లో కొన్నేళ్లుగా దళారులు చక్రం తిప్పుతున్నారు. స్థానికంగా ఉన్న ట్రేడర్స్‌. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ట్రేడర్స్‌లు లాబీయింగ్‌ చేయడం ద్వారా ట్రేడర్స్‌కు లాభాలు, రైతులకు నష్టాలు అనే విధంగా మారిపోయిందని రైతులు చెబుతున్నారు. ఏమైనా మాట్లాడితే మళ్లీ ట్రేడర్‌ గుడ్లు కొనుగోలు విషయంలో ఇబ్బందులు పెడతారనే ఆందోళన రైతుల్లో ఉండటమే కారణం. దళారీ వ్యవస్థ వల్ల ఇటు పౌల్ట్రీ రైతులు కాని, అటు వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగం లేదు. గుడ్డు ధరలతో సంబంధం లేకుండా మార్కెట్‌లో వినియోగదారుడు ఒక్కొక్కటీ రూ.ఐదుకు విక్రయిస్తున్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం బోర్టు ఏర్పాటు చేయలని రైతులు కోరుతున్నారు.

➡️