అమలు కాని హామీలు

May 20,2024 22:02
అమలు కాని హామీలు

ప్రజాశక్తి – యు. కొత్తపల్లి వందలాది పరిశ్రమలు వస్తాయన్నారు… ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని సభలు పెట్టి ఊదరగొట్టారు. పరిశ్రమల స్థాపన కోసం స్థలం అవసరమన్నారు… పొలాలు ఇస్తే మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని నమ్మబలికారు. ఇష్టం ఉన్నా లేకున్నా భూములు లాక్కున్నారు. పునరావాస కేంద్రాలకి తరలించారు. ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు రాలేదు.. పిల్లలకు ఉద్యోగాలూ లేవు. ఇటు భూమి పోయి అటు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పూటకూడా గడవక నానా పాట్లు పడుతున్నారు సెజ్‌ నిర్వాసితులు.  జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సెజ్‌ కోసం 10 వేల ఎకరాలను సేకరించారు. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలంలో శ్రీరాంపురం, పొన్నాడ గ్రామ పంచాయితీల పరిధిలోని 12 గ్రామాల నుంచి ఈ భూములను సేకరించింది. వీరి కోసం కొత్తమూలపేటలో 967 గృహాలతో నిర్వాసిత కాలనీని ఏర్పాటు చేసింది. ప్రారంభంలో సుమారు 600 కుటుంబాలు పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. అనంతరం దఫదఫాలుగా పూర్తి స్థాయిలో బాధితులంతా పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అప్పట్లో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి జాబ్‌కార్డుతో పాటు, పునరావస కేంద్రానికి తరలివెల్లేందుకు ఒక్కో కుటుంబానికి రూ.66,250 అందించారు. ఉన్న ఇంటిని, సొంత ఊరును వదిలివెళ్లిన బాధితులకు ఉపాధి కరువైంది. చేసేది లేక బాధితులు రోడ్డెక్కారు. దీంతో ఒక్కో బాధిత కుటుంబానికి జీవనభృతి కోసం రూ.52 వేలు చొప్పున కెఎస్‌ఇజెడ్‌ అధికారులు అందించారు. ఏళ్లు గడుస్తున్నా ఉపాధి మాత్రం కల్పించలేదు. అధికారులు ఇచ్చిన జాబ్‌ కార్డులకు విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సెజ్‌ను జిఎంఆర్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో నిర్వాసితులు తము ఉపాధి కల్పించాలని ఉద్యమించారు. 2012, 2013లోనూ ఆందోళనలు చేశారు. ఆందోళన చేసినప్పుడల్లా సెజ్‌ అధికారులు బాధితులకు నచ్చచెబుతూ కాలం వెళ్లబుచ్చుతూనే ఉన్నారు. 2017లోనూ బాధితులు మరోమారు ఉద్యమించారు. దీంతో గతంలో జాబ్‌ కార్డులు వచ్చిన వారితోపాటు, కొత్తగా ఇవ్వాల్సిన వారికి జాబ్‌ కార్డులు ఇస్తామని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని మరోసారి హామీలు ఇచ్చారు. కాలం గడుస్తున్నా నేటికీ ఇవి అమలు కాలేదు.

➡️