ధాన్యం నగదు కోసం ఎదురుచూపు

Jun 20,2024 22:16
ధాన్యం నగదు కోసం ఎదురుచూపు

ప్రజాశక్తి-అమలాపురంరైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేసి 21 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పి నెల రోజులు గడిచినా ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రబీ పంటకు పెట్టుబడి పెట్టాలంటే రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఇవేప్రభుత్వం ఒక వైపు రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని 21 రోజుల్లో రైతులు ఖాతాల్లో నగదు జమ చేస్తామని రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతులు ఖాతాలో నగదు జమ చేస్తామని చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1,71,721 ఎకరాల్లో రబీ సాగు చేశారు. తద్వారా 6,30,857 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 1,71,721 ఎకరాలకు ఈ క్రాప్‌ బుకింగ్‌ చేశారు. రబీ పంటకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 7.74 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. 19,850 మంది రైతుల నుంచి రూ.355.84 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. 5,921 మందికి రూ.84,47 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతుల ధర్నారబీలో అమ్మిన ధాన్యాలకు వెంటనే సొమ్ములిప్పించాలని గురువారం కలెక్టరేట్‌ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రబీ ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యంతో రైతులందరూ క్రాఫ్‌ హాలిడే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన, అల్లవరం, తదితర మండలాల రైతులకు సొమ్ములు ఇంకా చెల్లించలేదన్నారు. ధాన్యం సొమ్ము లు నెలల తరబడి లేట్‌ అవ్వడం వల్ల పంట కోసం అని తీసుకున్న సొమ్ములకు అధిక వడ్డీ అవుతుందని రైతులు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా కుటుంబ పోషణ దుర్భరంగా ఉందన్నారు. దీనికి తోడు రుణ దాతల ఒత్తిళ్లు అవమానాలు ఎక్కువయ్యాయని వాటిని భరించడం రైతులకు చాలా కష్టంగా ఉందని వాపోయారు. ప్రభుత్వం ధాన్యం సొమ్ములను తక్షణమే తమ బ్యాంక్‌ అకౌంట్లకు చెల్లించాలని రైతులు కోరారు. లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

➡️