ఆరో రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 25,2023 22:57

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కరించాలని సిఐటియు కృష్ణాజిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల ముందు ప్రస్తుత సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో చేపట్టిన సమ్మె సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మెకు సంఘీభావం తెలిపిన సుబ్రమణ్యం మాట్లాడుతూ గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తాను అధికారంలోకి వస్తే సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్నా నేటికీ అమలు చేయలేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ, మినిమం టైం స్కేల్‌, హెచ్‌ఆర్‌ఎ, డిఎ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. పార్ట్‌ టైమ్‌ విధానాన్ని రద్దు చేసి ఫుల్‌ టైమ్‌ కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పి.పోతురాజు, ఎస్‌.శివ నాగరాజు, కోశాధికారి ఎం.ప్రశాంతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

➡️