గోనె సంచుల కోసం రైతుల అవస్థలు

Dec 25,2023 22:58

ప్రజాశక్తి-గన్నవరం

గోనె సంచులు లేక ధాన్యం అమ్ముకోలేక మండలంలోని రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నవంబరు చివర్లో యంత్రాలతో కోతలు కోసి ధాన్యం రోడ్లపై ఆరబెట్టి, తుపాన్‌కు తడిసి ముద్దయి, మళ్లీ వాటిని ఆరబెట్టి ధాన్యం విక్రయానికి సిద్ధం చేసిన రైతులకు మొండిచెయ్యే ఎదురవుతుంది. పదిహేను రోజులుగా ధాన్యం రోడ్లపైనే ఉందని, అమ్ముదామని గోనె సంచుల కోసం ధాన్యం నమూనా (శాంపిల్‌) తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే గోనె సంచులు లేక అధికారులు మొహం చాటేస్తున్నారని వాపోతున్నారు. తుపాన్‌కు ముందే పచ్చి వడ్లు అయినా తేమ శాతంతో నిమిత్తం లేకుండా రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేయాలని, తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తగ్గించి కొనాలని, ముందుగా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం, అధికారులు చేసిన ప్రకటనల వల్ల రైతాంగానికి ఏమాత్రం మేలు జరగలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్‌కు ముందు ఆన్లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన మిల్లర్లు ఆఫ్లైన్‌ ద్వారా ఒక్క గింజ కూడా రైతుల వద్ద నుంచి సేకరించకపోవడంతో రైతులు నిండా మునిగారు. సన్న, చిన్నకారు, కౌలు రైతులు తడిసిన ధాన్యం మళ్లీ రెండో సారి ఆరబెట్టి విక్రయానికి సిద్ధం చేసి గోనె సంచులు కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. గోనె సంచులు కోసం వెళ్తే నేడో, రేపో వస్తాయంటూ అధికారులు నుంచి సమాధానం వస్తుందని అంటున్నారు. అధికారుల ప్రకటనలకు, చేతలకు పొంత లేకుండా పోతుందని, దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రోజులు తరబడి గోనె సంచుల కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అవసరమైన గోనె సంచులను అందుబాటులోకి తీసుకువచ్చి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని వారు కోరుకుంటున్నారు.

➡️