బరిలో 207 మంది

Apr 29,2024 23:45
  • కృష్ణాలో 94, ఎన్‌టిఆర్‌లో 113 మంది పోటీ
  • నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి
  • గుర్తులు కేటాయింపు

ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 25వ తేదీ వరకు కొనసాగింది. ఈనెల 25వ తేదీన పరిశీలన జరిగింది. మూడు రోజుల పాటు ఉపసంహరణలకు వచ్చిన గడవు సోమవారంతో ముగిసింది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన తర్వాత 113 మంది అభ్యర్థులు మిగలగా, వీరిలో 19 మంది ఉపసంహరించుకున్నారు. 94 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్లో పరిశీలన తర్వాత 25 మంది మిగలగా, 10 మంది ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీలో ఉన్నారు. మచిలీపట్నం, పెడన, పామర్రుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. అవనిగడ్డలో ఒకరు, పెనమలూరులో ఒకరు, గన్నవరంలో ఇద్దరు, గుడివాడలో ఐదుగురు అభ్యర్దులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నంలో 14 మంది, పెడనలో 10 మంది, పామర్రులో ఎనిమిది మంది, అవనిగడ్డలో 12 మంది, పెనమలూరులో 11 మంది, గన్నవరంలో 12 మంది, గుడివాడలో 12 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి వైసిపి అభ్యర్ధిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, టిడిపి, బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎంపి వల్లభనేని బాలశౌరి, సిపిఎం, సిపిఐ, ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిగా గొల్లు కృష్ణ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో విజయవాడ పార్లమెంటుతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 125 మందికిగాను 12 మంది తమ నామినేషన్లు ఉపసహరించుకున్నారు. మొత్తం 113 మంది పోటీలో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్‌లో మొత్తం 19 మందికిగాను ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 17 మంది నిలిచారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 106 మందికిగాను 10 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 96 మంది బరిలో నిలిచారు. విజయవాడ సెంట్రల్‌లో 22 మందికిగాను ఇద్దరు ఉపసంహరించుకోవడంతో 20 మంది బరిలో నిలిచారు. పశ్చిమలో 17 మందికిగాను ఇద్దరు ఉపసంహరించుకోగా, పోటీలో 15 మంది ఉన్నారు. తూర్పులో 17 మందికిగాను ఇద్దరు ఉపసంహరించుకోగా, బరిలో 15 మంది నిలిచారు. మైలవరంలో 12 మంది బరిలో నిలిచారు. ఇక్కడ ఎవరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. నందిగామలో ఇద్దరు ఉపసంహరించుకోవడంతో 9 మంది బరిలో నిలిచారు. తిరువూరులో 13 మందికిగాను ఒకరు ఉపసంహరించుకోవడంతో 12 మంది పోటీలో ఉన్నారు. జగ్గయ్యపేటలో 14 మందికిగాను ఒకరు ఉపసంహరించుకోగా, 13 మంది బరిలో ఉన్నారు.

➡️