ఉపాధి కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి

Apr 10,2024 22:41
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘు

ప్రజాశక్తి-గన్నవరం

ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.రఘు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం గన్నవరం మండలం బుద్ధవరం పరిధిలో దాసుడుపాకల వద్ద పనులు చేస్తున్న ఉపాధి కార్మికులను ఆయన కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండడంతో మంచినీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని, షామియానా కూడా ఏర్పాటు చేయలేదని, రోజు వేతనం రూ.200 రావటం లేదని కార్మికులు చెప్పారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజులు పనులు చూపించాలని, వేసవిలో వంద రోజులు పని చూపించి రోజుకు కనీసం రూ.500 తగ్గకుండా వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం రూ.300 మాత్రమే వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారని, పనులు సరిగా చేయడం లేదని రూ.200 నుంచి 240 వరకు ఇచ్చి సరిపెడుతున్నారని చెప్పారు. కొన్నేళ్లుగా సిపిఎం చేస్తున్న పోరాట ఫలితంగా వేతనం క్రమంగా పెరుగుతుందని, మళ్లీ ఆందోళన చేయడం ద్వారా వేతనాన్ని రూ. 600 వరకు పెంచుకోవాలని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కూలీలు బ్రతకడం కష్టంగా మారుతుందని, కూలీ వేతనం పెరిగితేనే కొనుగోలు శక్తి పెరిగి జీవనం సాఫీగా సాగుతుందన్నారు. కూలీలంతా సంఘటితంగా ఉండి, ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటీ ద్వారా సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు అన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి పోరాటం చేయక తప్పదన్నారు. రాష్ట్రంలో అధికార వైసిపి, బిజెపి కూటమికి కూలీల సమస్యలు పట్టడం లేదన్నారు. ఎంతసేపు ఆ పార్టీ నేతలు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపెడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బిజెపితో దోస్తీ కట్టి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు మరియదాసు, నక్కా రామారావు, మిరప నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️