రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తు

Apr 1,2024 13:14 #Krishna district

 తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హసీమ్ బేగ్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారని టిడిపి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హసీమ్ బేగ్  అన్నారు. సోమవారం 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో హసీమ్ బేగ్ మాట్లాడుతూ బిజెపితో పొత్తు పెట్టుకున్నందుకు వైసిపి వారు ముస్లింలను రెచ్చగొట్టడం దుర్మార్గం అన్నారు. పార్లమెంటులో ముస్లింల బిల్లులు కేంద్రం ప్రవేశపెడితే అక్కడ వైసిపి మద్దతు ఇచ్చి, ఇక్కడ రాష్ట్రంలో వైసిపి పాలకులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.అబ్దుల్ సలాంని వైసిపి నాయకులు వేధించడంతో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునేలా చేశారాని అప్పుడు ముస్లింల పై ప్రేమ ఏమైందని ప్రశ్నించారు. గత టిడిపి ప్రభుత్వంలో హజ్ హౌస్ కట్టాం అని, మైనారిటీలకు సబ్సిడీ లోన్లు, ముస్లిం ఆడబిడ్డలకు దులహన్ పథకం ఇచ్చామని, ముస్లింలలోని పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా విదేశీ విద్య లాంటి ఎన్నో పథకాలు చంద్రబాబు అందజేస్తే, ఈ వైసీపీ పాలనలో గడిచిన ఐదేళ్లలో ముస్లింల పథకాలు అన్ని రద్దుచేసి ముస్లింలను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. చంద్రబాబు పొత్తు కూటమి కోసం కాదు అని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నారు. మనకు కావలసింది కులం, మతం ప్రాంతం కాదు, మన రాష్ట్ర అభివృద్ధి, మన సంక్షేమం అన్నారు.గడిచిన ఐదేళ్ల వైసిపి పాలనలో కరెంటు చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఏ విధంగా పెంచేశారో ప్రజలు గ్రహించాలన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, నాయకులు, వాడపల్లి మహేష్, మస్తాన్, సయ్యద్ సిరారుద్దీన్, తస్లీమ్ బేగ్, ఎస్కే అక్బర్, అబ్దుల్ రహీం, ఎండి ఆరిఫ్, సాయి కృష్ణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️