త్యాగానికి ప్రతీక బక్రీద్

గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : సమైక్యతను, సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. బక్రీద్ పురస్కరించుకుని సోమవారం మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మంత్రి పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అల్లాహ్ పై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటి వారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలన్నారు. ఈ ప్రార్థనల్లో జన సేన నియోజక వర్గ ఇంఛార్జి బండి రామకృష్ణ, టిడిపి మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్ ఖాజా,పలువురు ముస్లిం పెద్దలు, సోదరులు పాల్గొన్నారు.

➡️