సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు 

Jul 1,2024 15:53 #Krishna district

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక 27వ డివిజన్ నబిఖానా నూరుద్దీన్ పేటలో నూరు శాతం అంగవైకల్యం కలిగి, మంచానికే పరిమితమైన సీమ ఫర్విన్ కు ఎన్టీఆర్ భరోసా క్రింద రూ.15 వేల రూపాయల పింఛను మొత్తాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ వద్ద 4వ డివిజన్లో వృద్ధురాలు కాగిత రాధమ్మ తదితర లబ్ధిదారులకు మంత్రి, కలెక్టర్ సామాజిక పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూరు శాతం అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు సీమ పర్వీన్ గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నదని పింఛను నిలిపివేయడంతో, ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తొలి పించను అందజేసినట్లు తెలిపారు. నూరు శాతం అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15 వేలకు పెంపు చేసిందని అన్నారు. అదేవిధంగా సామాజిక పింఛన్ నెలకు 3 వేల నుంచి 4 వేలకు పెంపు చేస్తూ, జూలై మాసం 4000 పింఛన్ తో కలిపి ఏప్రిల్ మే జూన్ మాసాల పెంపు మొత్తం 3 వేలతో కలిపి మొత్తం రు. 7000 పింఛన్ ఈరోజు లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నుంచి జిల్లాలో 2.42 లక్షల మందికి ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. కలెక్టరేట్, జిల్లాలో అన్ని ఎంపీడీవో కార్యాలయాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పింఛన్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పింఛను పొందిన లబ్ధిదారు సీమ పర్వీన్ తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు బందరు ఆర్డిఓ ఎం వాణి, డిపిఓ, డి ఆర్ డి ఎ పిడి ఇన్చార్జి ఎస్ వి.నాగేశ్వర నాయక్, జడ్పీ సీఈవో ఇంచార్జ్ ఆనంద్ కుమార్, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు ఎస్.కె భాజాని, ఇలియాస్ పాషా, సయ్యద్ ఖాజా, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️