మళ్లీ పింఛన్‌ టెన్షన్‌

Apr 30,2024 23:34
  •  నేటి నుంచి 5 వరకు పంపిణీ
  • లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలో
  • బ్యాంక్‌ ఖాతా లేని వారికి ఇళ్ల వద్దే
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,81,629 పింఛన్‌దారులు
  • పంపిణీ చేయాల్సిన మొత్తం రూ.142.98 కోట్లు

ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి

సామాజిక పింఛన్‌దారులకు మళ్లీ టెన్షన్‌ మొదలైంది. గత నెల పెన్షన్లు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం నుంచి మేలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మే 1వ తేదీ నుండి ఐదో తేదీ వరకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్నారు. బ్యాంక్‌ ఖాతా ఉన్న లబ్ధిదారులకు వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు మాత్రం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.ఎన్నికల సమయంలో వద్ధులకు, వితంతు మహిళలకు, వికలాంగులకు పింఛను పంపిణీకి ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కిందటి నెల నుంచి వాలంటరీలతో కాకుండా సచివాలయం ఉద్యోగులు పింఛను పంపిణీ చేశారు. అధికారులు ఇంకో అడుగు ముందుకేసి మే పింఛను లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తామని ప్రకటించారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 4,81,629 పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తంగా 17 రకాల పెన్షన్లను లబ్ధిదారులు అందుకుంటున్నారు. వీటిలో వద్ధాప్య పెన్షన్లే అగ్రభాగాన ఉన్నాయి. వీరిలో దాదాపు 60 శాతానికిపైగా 70 ఏళ్లు పైబడినవారే ఉన్నారు. వీరంతా ఎండల్లో బయటకు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరమైన అంశమే. 80 ఏళ్లు దాటి కదల్లేని స్థితిలో ఉన్నవారు 10 శాతం వరకు ఉంటారు. వీరంతా బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవడం కష్టమే. సీనియర్‌ సిటిజన్లు, బ్యాంక్‌లో అకౌంట్‌ ఉన్న వారు ప్రతి నెలా కొంత మొత్తం మినిమం బ్యాలెన్స్‌ మెయింటినెన్స్‌ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది వద్ధులు, వికలాంగులు, వితంతువులు, మరికొంత మంది మినిమం బాలన్స్‌ కూడా మెయింటెనెన్స్‌ చేసే పరిస్థితిలేదు. పింఛన్‌ లబ్ధిదారుల ఖాతాలో మైనస్‌ బ్యాలెన్స్‌లో ఉన్నది. మరి కొంతమందికి ఆధార్‌ లింకుతో ఉన్న బ్యాంక్‌ అకౌంటు ఎన్‌పిఏ లో కూడా ఉన్నాయి. పింఛన్‌ డబ్బు జమకాగానే మైనస్‌ బాలెన్స్‌ ఉంటే బ్యాంక్‌ అధికారులు కట్‌ చేసుకుంటారని, ఎన్‌పిఏలో ఉన్న ఎకౌంటు మళ్లీ యాక్టివేషన్‌ చేయించుకునేంతవరకు డబ్బులు రావని ఆందోళన చెందుతున్నారు. రూ.3 వేల పెన్షన్‌ మొత్తంలో కొంత మెత్తాన్ని మైనస్‌ బ్యాలెన్స్‌గా బ్యాంక్‌ అధికారులు కట్‌ చేసుకుంటే తమకు వచ్చే పెన్షన్‌ రోజువారి అవసరాలు సరిపోవని, పూట గడవటం చాలా కష్టంగా ఉంటుందని లబ్ధిదారులు వాపోతున్నారు. మినిమం బ్యాలెన్స్‌ మెయింటినెన్స్‌ లేకుండా లబ్ధిదారులకు పెన్షన్‌ డ్రా చేసుకునే అవకాశం ఉండదన్నారు. అదేవిధంగా మైనస్‌ బ్యాలెన్స్‌లో ఉన్న అకౌంట్‌ కచ్చితంగా బ్యాంక్‌ అధికారులు తమకు రావాల్సిన డబ్బును కట్‌ చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెన్షన్లు ఇవ్వటానికే బ్యాంకులు పనిచేయవు. అదనపు సిబ్బంది ఉండరు. ఈ విధానం వల్ల బ్యాంకుల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సి ఉంటుందని వద్ధులు ఆందోళన చెందుతున్నారు. మండుటెండల్లో వద్ధులు బ్యాంకులకు వెళ్లగలరా? వెళ్లినా క్యూల్లో నిలబడగలరా? డబ్బు తీసుకునే విత్‌డ్రా ఫారాలను పూర్తిచేయగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతనెల పెన్షన్‌ తీసుకోవటానికి మూడు రోజుల సమయం కూడా పట్టింది. మండలంలో ఒకేఒక బ్యాంకు శాఖ ఉంటుంది. అంటే ఆయా గ్రామాలు, వార్డుల్లోని పెన్షన్‌దారులంతా ఆ బ్యాంకు దగ్గరకే వెళ్లడం వల్ల రద్దీ పెరుగుతుంది. వందల సంఖ్యలో వచ్చే వద్ధులకు బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేసే పరిస్థితి లేదు. బ్యాంకులో వేసిన పెన్షన్‌ సొమ్మును డ్రా చేసుకోవడం కోసం తీవ్రమైన ఎండలో బ్యాంకు చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడాలని భయపడుతున్నారు. మండుటెండల్లో వద్ధులకు ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదనే వాదన వినిపిస్తోంది. బ్యాంకుల్లో కంటే సచివాలయాల్లో ఇవ్వడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకు ఖాతాలో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాలను, ఎన్‌పిఏ లో ఉన్న ఖాతాలను పరిశీలించి పింఛన్‌ సొమ్మును నేరుగా ఖాతాలో జమ చేయకుండా తమ చేతికి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లేకపోతే సచివాలయాల అధికారులతో పంపిణీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️