హామీలు అమలు చేయని వారిని ప్రశ్నించండి

Apr 19,2024 23:35

సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారు ఓట్లు అడగడానికి వస్తే ప్రశ్నించాలని ఇండియా వేదిక బలపరిచిన గన్నవరం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించబడాలంటే రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పదేళ్లిస్తామని తిరుపతిలో ప్రకటించిన బిజెపి అనంతరం ప్రజలను నట్టేటా ముంచిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగాన్ని కాపాడుతుందని, పేదల సంక్షేమ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, కార్పొరేటర్లకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల్లో విభజన తెస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపిని, దానితో జత కట్టిన పార్టీలను, తొత్తుగా వ్యవహరించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో అభివృద్ధి జరగలేదని ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు పనులు లేకుండా పోయాయని చెప్పారు. ఈ సమస్య వైసిపి, టిడిపిలకు పట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలని వచ్చిన వారిని ప్రజలు ప్రశ్నించాలని ఆయన పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కోరం రవి, మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు, నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, కొవ్వూరు రైతు సంఘం నాయకులు పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్‌ జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు నిమ్మగడ్డ నరసింహ, రాష్ట్ర మత్స్య కార్మిక సంఘ కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజనాల సురేష్‌, సిఐటియు ఉపాధ్యక్షులు మర్రాపు పోలినాయుడు పాల్గొన్నారు.గన్నవరంలో సిపిఎం ప్రచారంప్రజాశక్తి-గన్నవరం: నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఎర్రజెండా అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావుకు ఓటు వేయాలని కోరుతూ శుక్రవారం గన్నవరంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వామ పక్ష నాయకులు మీరాఖాన్‌, పఠాన్‌ సర్దార్‌, మిరప నాగేశ్వరరావు, దాదా, ఉడత రామకష్ణ, విజయరావు, వెంకటేశ్వరరావు వియన్‌ పురంలో, గన్నవరంలో ఎన్‌. శ్రీనివాసరావు, మాదిరెడ్డి చిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

➡️