బిజెపికి ఊడిగం చేసే పార్టీలను తిరస్కరించండి

Apr 22,2024 23:47
  •  నున్నలో సిపిఎం గన్నవరం అభ్యర్థి విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-గన్నవరం

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి, దానికి ఊడిగం చేస్తున్న పార్టీలను ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని గెలిపించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు జి.వి.రంగారెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం ఇండియా వేదిక అభ్యర్థులు అధికారం చేపడితేనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నిరుద్యోగం పెరిగిందని, ప్రజల ఆకలి బాధలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. బిజెపికి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. మోదీకి ప్రయోజనం చేకూర్చే విధంగానే చంద్రబాబు, జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. సిపిఎం గన్నవరం అభ్యర్థికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై, మచిలీపట్నం ఎంపి కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లు కృష్ణకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం నాయకులు ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఎర్రజెండాకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలన్నారు. గామాల్లో సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ అందరికీ న్యాయం చేస్తానని సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, సిపిఎం నాయకులు మాతంగి ఆంజనేయులు, జి.చిన్నవెంకటరెడ్డి, సట్టు శ్రీనివాసరావు, దుర్గారావు, పోలారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, ఎం.కోటేశ్వరరావు, ఎం.సురేష్‌, కళ్లం అరుణ్‌, జి.సత్యనారాయణరెడ్డి, జి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️