కోలాహలంగా సాగిన ర్యాలీలు

Apr 25,2024 23:15

ప్రజాశక్తి-గుడివాడ 

గుడివాడ వైసిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నామినేషన్‌ కోలాహలంగా జరిగింది. గురువారం స్ధానిక శంకరమఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాజేంద్రనగర్‌లో తన ఇంటికి చేరుకున్న కొడాలి నానికి భార్య, కుమార్తెలు హారతులు ఇచ్చిన అనంతరం నామినేషన్‌ ర్యాలీకి బయలుదేరారు. రైతులు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండి మీద ర్యాలీగా బయల్దేరారు. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఉప్పాల హారిక, పెడన వైసిపి అభ్యర్థి ఉప్పాల రాములతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఏలూరురోడ్డు, నెహ్రూచౌక్‌, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ రోడ్డు మీదుగా స్ధానిక అర్‌డిఓ కార్యాలయం వద్దకు చేరుకుంది. అనంతరం రిటర్నింగ్‌ అధికారి పద్మావతికి నామినేషన్‌ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కొడాలి నాగేశ్వరరావు(చిన్ని), గొర్ల శ్రీను, పెయ్యిల ఆదాం తదితరులు పాల్గొన్నారు. పెదపారుపూడి: వైసిపి పామర్రు నియోజకవర్గ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ పామర్రు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీదేవికి నామినేషన్‌ పత్రం గురువారం దాఖలు చేశారు. అనంతరం స్థానిక సెంటర్‌ బహిరంగ సభలో మాట్లాడారు. గన్నవరం: గన్నవరం వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ గురువారం భారీ జన సందోహం నడుమ మూడోసారి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనగాని రవి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, జడ్పిటిసి ఎలిజిబెత్‌ రాణి, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్స్‌ సభ్యులు ఎండి గౌసాని, వంశీ సతీమణి పంకజశ్రీ తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు: పెనమలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వెలిసేలా సుబ్రహ్మణ్యం గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధనేకుల మురళీమోహన్‌రావు, వింత సంజీవరెడ్డి, ఉప్పాల త్రిమూర్తులు, ఎస్‌కె మస్తాన్‌వలి, ముల్లంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం ఇప్పటివరకు 23 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బాలసుబ్రమణ్యం తెలిపారు. గురువారం ఒక్కరోజే 8 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. వైసిపి తరఫున సింహాద్రి రమేష్‌బాబు 4, ఎన్డీఏ కూటమి నుండి మండలి బుద్ధ ప్రసాద్‌ 2, మండలి వెంకట్రామ్‌ 2, కాంగ్రెస్‌ పార్టీ నుండి అందే శ్రీరామ్‌ మూర్తి 2, ఇండిపెండెంట్‌గా నాదెండ్ల గిరిధర్‌ నాయుడు 2, సింహాద్రి వికాస్‌ ఒకటి, మతి పుష్పకుమార్‌ 2, వెంట్రప్రగడ ఆనంద్‌ కుమార్‌ 1, తానంకి చంటి 1, నీల మోహన్‌ రావు 1, అందే శ్రీవాణి 1, జై భారత్‌ భీమ్‌ పార్టీ తరఫున సముద్రాల అంబేద్కర్‌ 1, భోజన సమాజ్‌ పార్టీ తరఫున గుంటూరు నాగేశ్వరరావు 1, పిరమిడ్‌ పార్టీ తరఫున వెంకట నాంచారయ్య 1, ఇండిపెండెంట్‌ బోయిన బుద్ధ ప్రసాద్‌ 1 సెట్‌ నామినేషన్లు వేసినట్లు తెలిపారు. అవనిగడ్డలోని ఎన్నికల నామినేషన్లు వేసే కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడువు ముగిసిందని రమేష్‌బాబు అనే అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించడంతో పాటు కార్యాలయం లోపల ఉన్న ఎమ్మెల్యే అనుచరులను బయటకు పంపని అధికారుల చర్యలను జనసేన, టిడిపి కార్యకర్తలు వ్యతిరేకించారు. అధికారుల సైతం అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ త్రినాథ్‌, ఎస్‌ఐ రమేష్‌ స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

➡️