ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు

May 23,2024 13:46 #Krishna district

జిల్లా ఎన్నికల అధికారి
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుగుణంగా ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎంకే మీనా గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్కు హాజరై జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఎన్నికల సంఘం సీఈఓ కు వివరించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరిగిన నేపథ్యంలో కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టటకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు వేరు వేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు, పార్లమెంటు, అసెంబ్లీ ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్ళు, ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్ తో పాటు ఇద్దరు కౌంటింగ్ సహాయకులు, ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్ లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వీరికి విధులు కేటాయించుటకు ఈనెల 26వ తేదీన మొదటి ర్యాండమైజేషన్, జూన్ 3 తేదీన రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యను బట్టి 15 నుండి 22 రౌండ్ల వరకు ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు పార్లమెంట్ నియోజకవర్గం 14 టేబుళ్ళు, 4 రౌండ్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన బ్యాలెట్ సంఖ్యను బట్టి టేబుళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి మే 28, జూన్ 3వ తేదీల్లో రెండు పర్యాయాలు కౌంటింగ్ శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

➡️