ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి

Apr 15,2024 23:51
  • ప్రజా సమస్యలు పట్టణ పాలకులకు బుద్ధి చెప్పాలి
  • ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు

ప్రజాశక్తి-గన్నవరం

రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని, ప్రజా సమస్యలు పట్టని పాలకులకు బుద్ధి చెప్పాలని ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్వి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు సోమవారం విజయవాడ రూరల్‌ మండలం పి.నైనవరం గ్రామంలో పర్యటించారు. పేదల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ఇంకా ఇళ్ల స్థలాలు రాలేదని, రోడ్లు లేవని, లైట్లు వెలగడం లేదని మహిళలు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని రానున్న ఎన్నికల్లో సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి వైసిపి, టిడిపి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో రాజకీయ మోసాలు జరిగాయని, అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పేదలకు ఇల్లు రాకుండా చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో సరైన రోడ్లు లేవని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ప్రస్తుత వైసిపి, గతంలో టిడిపి నిర్లక్ష్య వైఖరి అవలంభించాయని విమర్శించారు. గత ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా లైట్లు కూడా వేయలేని దుస్థితి ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా దేశాన్ని నాశనం చేసేందుకు సిద్ధమైన బిజెపిని ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహిస్తున్న జగన్‌, ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఇద్దరూ బిజెపితో దోస్తీ కట్టి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నీతివంతమైన రాజకీయాలు చేస్తున్న సిపిఎంకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️