ఎర్రజెండా పోరాట ఫలితంగానే వేతనాలు పెంపు

Apr 8,2024 22:56
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
  •  గన్నవరం నియోజకవర్గంలో వెంకటేశ్వరరావు ప్రచారం

ప్రజాశక్తి-గన్నవరం: ఎర్రజెండా పోరాట ఫలితంగానే ఉపాధి కూలీల వేతనం రోజుకు 26 రూపాయలు పెరిగిందని, రానున్న రోజుల్లో వేతనం రోజుకు రూ.500కు పెంచాలని ఉద్యమం చేస్తున్న ఎర్ర జెండాకు ఉపాధి కూలీలు అండగా నిలవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపునిచ్చారు. గన్నవరం మండలం ముస్తాబాదలో సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు ఉపాధి కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఎండలో పని చేస్తున్న కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనిచేసే చోట షామియానా ఏర్పాటు చేయాలని, మంచినీటి వసతి కల్పించాలని, పలుగు, పార వంటి పరికరాలు సరఫరా చేయాలని కూలీలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఉపాధి కూలీల సమస్యలపై మొదట నుంచీ ఎర్రజెండా పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు. ఏడాదిలో పని దినాలు 200 రోజులు కల్పించాలని, వేతనం రోజుకు రూ.600 వరకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం రూ.274 వేతనం ఇస్తుండగా ఆందోళన చేస్తే 26 రూపాయలు పెంచి రూ.300 ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో బహిరంగంగా కూటమి కడితే, వైసిపి రహస్య ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కూలీల కోసం పనిచేసే అభ్యర్థులకు ఓట్లు వేసి అండగా నిలవాలన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు టివి లక్ష్మణస్వామి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. భూముల నుంచి రైతులను, కౌలుదారులను బయటకు నెట్టి కార్పొరేట్‌ వ్యవసాయం చేసే ఆలోచన చేస్తుందన్నారు. అదే జరిగితే భూములన్నీ కార్పొరేట్‌ కంపెనీల చేతిలోకి వెళ్లిపోతాయని, రైతులు కూలీలుగా మారి ఆ భూమిలో పని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్న వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. పరోపక్క ఉపాధి కూలీలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, కళ్లం రాంబాబు, ఏసుదాసు పాల్గొన్నారు.ప్రజాశక్తి-ఉంగుటూరు: మండలంలోని తుట్టగుంట, వెల్డిపాడు గ్రామాల్లో సిపిఎం నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్లం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు, కౌలు రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న బిజెపికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టివి లక్ష్మణస్వామి, ఎ జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పవన్‌ కుమార్‌, మండల కార్యదర్శి అజ్మీరా వెంకటేశ్వరరావు, నాయకులు పిల్లి రాజారావు, మాగంటి సాంబశివరావు, పులి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️