ఇండియా వేదికతోనే దేశానికి మనుగడ

Apr 14,2024 23:22
  • సిపిఎం గన్నవరం అభ్యర్థి వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-గన్నవరం

రానున్న రోజుల్లో దేశం మనుగడ సాగించాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే సాధ్యమని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ, దానికి మద్దతు పలుకుతున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని కోరారు. మండలంలోని మండలవారిగూడెంలో, ముస్తాబాదలో ఆదివారం ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి నిర్వహించారు. రైతులను, కార్మికులను కలిసి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ మూడు రాజధానుల పేరుతో ఏకంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, వారిని ప్రతిఒక్కరూ ఈ అంశంపై ప్రశ్నించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేసిందన్నారు. ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, బెజవాడ తాతబ్బాయి, తుల్లిమిల్లి తిరుపతయ్య, కళ్లం రాంబాబు, కోటయ్య, నాగరాజు, ఏసుదాసు పాల్గొన్నారు.బిబి గూడెంలో వామపక్షాల ప్రచారంఇండియా వేదిక మద్దతు ఇచ్చిన గన్నవరం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఆదివారం గన్నవరం మండలం బిబి గూడెం గ్రామంలో వామపక్షాల నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. దాసరి నగర్‌, ఓసి కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నిజాయితీ కలిగిన వారిని ఈ రాజకీయాల్లో ఎన్నుకోవాలని కోరారు. రైతులు కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థి వెంకటేశ్వరరావుకు మద్ధతు ఇవ్వాలని విన్నవించారు. ఉంగుటూరు : విలువలతో కూడిన రాజకీయాలను స్వాగతించి ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించే ప్రజల మనిషి సిపిఐ, కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.జ్యోతి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మండలంలోని తేలప్రోలు గ్రామంలో వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడంలో, ప్రభుత్వం భూ సేకరణ సందర్భంగా రైతులకు తగిన పరిహారం ఇప్పించాలని జరిగిన పోరాటాల్లో వెంకటేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టివి లక్ష్మణస్వామి, నాయకులు పి.పవన్‌కుమార్‌, శివనాగేంద్రం, మండల కార్యదర్శి అజ్మీరా వెంకటేశ్వరరావు, రాజేష్‌, కీర్తి, ప్రకాశరావు, గంగాధర్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️