చదువుతోపాటు క్రీడల్లోనూ ఆణిముత్యాలే..

Dec 17,2023 17:15

జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న గోనెగండ్ల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు

చదువుతోపాటు క్రీడల్లోనూ ఆణిముత్యాలే..

ప్రజాశక్తి – గోనెగండ్ల

గోనెగండ్ల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ప్రశంసా పత్రాలను అందుకొటూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తాచాటుతూ గోనెగండ్ల మోడల్‌ స్కూల్‌కు మెడల్స్‌ తీసుకొస్తున్నారు. అయితే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ, అలాగే క్రమశిక్షణలోనూ ఉండేందుకు ఇక్కడి పాఠశాల ప్రిన్సిపల్‌ పాత్ర కీలకం అని పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్ని ప్రమాణాలతో కార్పొరేట్‌కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంతో కూడిన విద్యను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో మోడల్‌ పాఠశాలల ఏర్పాటుకు 2012లో శ్రీకారం చుట్టింది. మండల కేంద్రమైన గోనెగండ్లకు సమీపంలో గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద 2013లో ఏపీ మోడల్‌ పాఠశాల ఏర్పాటు అయింది. పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థిని విద్యార్థులు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు వివిధ రకాల క్రీడల్లోనూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలలో రాణిస్తూ ఉన్నతాధికారుల నుంచి పథకాలు ప్రశంసా పత్రాలను పొందుతూ పాఠశాలకు వన్నె తెస్తున్నారు. గోనెగండ్ల మోడల్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ షాహినా పర్వీన్‌ ఆదివారం ప్రజాశక్తితో మాట్లా డుతూ తమ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాష్ట్రస్థాయితో పాటు జాతీయస్థాయిలో రాణించడం వారి సర్వతోముఖాభివృద్ధికి నిదర్శనమని అన్నారు.జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌లో.. ఇటీవల చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో జరిగిన 42వ జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 11 మంది క్రీడాకారులతో కూడిన టీంలో గోనెగండ్ల ఎపి మోడల్‌ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న టి నరేంద్ర నాయుడు పాల్గొన్నాడు. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి 19 వరకు జరిగిన జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ జూనియర్స్‌ పోటీలలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాడు.400 మీటర్ల రాష్ట్రస్థాయిలో..జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న మరో విద్యార్థి సి మహేంద్ర డిసెంబరు 14న గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ స్టేట్‌ మీట్‌ రిలే 4లి400 విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు.జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపిక కె గణేష్‌ ఆచారి అనే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థి డిసెంబర్‌ 11న ఏలూరులో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ త్రో బాల్‌ స్టేట్‌ మీట్‌ పోటీలలో అత్యంత ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈనెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీలలో పాల్గొనబోతున్నాడు.ఇలా గోనెగండ్ల మోడల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒక పక్క చదువులో రాణిస్తూ మరోపక్క వివిధ క్రీడాంశాల్లో జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ వారు మరెన్నో విజయాలను సాధించి పాఠశాలకు పుట్టిన గ్రామానికి తల్లిదండ్రులకు పేరు తెచ్చి మంచి భవిష్యత్తును పొందాలని ఆకాంక్షిస్తున్నారు.

➡️