తాగునీటి ట్యాంకు ప్రారంభం

Jan 6,2024 20:13

దాతను సన్మానిస్తున్న డిఇఒ

– హాజరైన డిఇఒ రంగారెడ్డి
ప్రజాశక్తి – హోళగుంద
విద్యార్థుల తాగునీటి కష్టాన్ని గుర్తించిన మిక్కిలినేని వెంకట శివప్రసాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రూ.2.50 లక్షలు వెచ్చించి తాగునీటి ట్యాంకు నిర్మాణం చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. శనివారం ట్యాంకు ప్రారంభోత్సవం చేపట్టారు. డిఇఒ డాక్టర్‌ రంగారెడ్డి, ఆదోని డిప్యూటీ డిఇఒ రమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సేవాగుణం అవసరమని, విద్యార్థుల తాగునీటి కష్టాన్ని గుర్తించిన శివ ప్రసాద్‌ విద్యార్థుల కోసం తాగునీటి ట్యాంకు నిర్మించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం దాత శివప్రసాద్‌ మాట్లాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులను ప్రోత్సహించడం కోసం మొదటి బహుమతి కింద రూ.50 వేలు, రెండో బహుమతి కింద రూ.15 వేలు, మూడో బహుమతి కింద రూ.10 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పి.శ్రీనివాసులు యాదవ్‌, ఎంఇఒలు సత్యనారాయణ, జగన్నాథం, ఎస్‌బిఐ మేనేజర్‌ రామ్మోహన్‌, యంగ్‌ డైనమిక్‌ సేవా ప్రదాత షబ్బీర్‌ సాహెబ్‌, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ సిద్ధయ్య, ప్రధానోపాధ్యాయులు నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

➡️