రైతుల పొలాల్లో కొలతలు సరిచేయాలి

May 27,2024 17:12 #Kurnool

తుగ్గిలి తాసిల్దార్ కార్యాలయం ఎదుట వ్యకాస, రైతు సంఘము

ప్రజాశక్తి-తుగ్గలి : తుగ్గలి మండలం పరిధిలోని సూర్య తాండా,బాట తండా ఉప్పర్లపల్లితో పాటు వివిధ గ్రామాలలో రైతుల పొలాలకు సంబంధించి భూ సర్వేలో సక్రమంగా సర్వే చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తుగ్గలి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శ్రీరాములు, రైతు సంఘం మండల కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ తుగ్గలి మండలంలో రైతులకు సంబంధించిన భూ సర్వేలో అవకతవకలు జరిగాయని దీంతో చాలామంది రైతులు భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు. భూ సర్వే తప్ప తడకల చేయడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులుకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో సరిగా లేనందు వల్ల బ్యాంక్ అధికారులు రుణాలు పూర్తిగా తగ్గించారన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల స్పందించి గ్రామ రిసర్వే మరలా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ షర్మిల కు వినిత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, బీమా నాయక్, సుంకన్న, ఆంజనేయ, నారాయణ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️