భూములు త్యాగం చేసిన వారికి నీరు కరువు

Mar 29,2024 17:06 #Kurnool

సిపిఎం నాయకులు బి చంద్రబాబు నాయుడు డిమాండ్
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం బీసీ ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పార్టీ బృందం శాఖ కార్యదర్శి బి చంద్రబాబు నాయుడు, సభ్యులు చాంద్ బాషా మల్లమ్మ రమాదేవిలు కాలనీలను సందర్శించి నీటి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులకు పైగా బీసీ ఎస్సీ కాలనీ ప్రజలు మంచినీళ్ల కోసం పనులు మానుకొని నీళ్ల ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. శకునాల గ్రామంలో సోలార్ పరిశ్రమకు రైతులు, వ్యవసాయ కార్మికులు వేలాది ఎకరాల భూములు త్యాగం చేశారని అలాంటి ప్రజలకు బోరు వేసి నీళ్లు ఇవ్వడంలో అధికారులు తీవ్రమైన జాప్యం చేస్తున్నారని విమర్శించారు. సోలార్ పరిశ్రమ వల్ల గ్రామానికి కోట్లాది రూపాయలు విడుదల అయ్యాయని ఆ డబ్బులు ఏమయ్యాయో ప్రజలు ఎవరికి తెలియదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే బీసీ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️