డిఆర్‌ఎంను కలిసిన రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ నేతలు

ఈస్ట్‌కోస్టు రైల్వే శ్రామిక్‌ యూనియన్‌

ప్రజాశక్తి- మాధవధార : ఈస్ట్‌కోస్టు రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ డివిజనల్‌ కోఆర్డినేటర్‌గా పప్పల రామమోహనరావు.ఎన్నికైనట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడిన సందర్భంగా శ్రామిక్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి పికె. పట్సహాని నాయకత్వంలో శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలతో భారీ ఎత్తున తరలివెళ్లి డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, ఇతర రైల్వే ఉన్నత అధికారులను బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈనెల 5వ తేదీన భువనేశ్వర్‌లో జరిగిన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో విశాఖపట్నం డివిజన్‌ డివిజనల్‌ కోఆర్డినేటర్‌గా పప్పల. రామ్మోహనరావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహనరావుతోపాటు జోనల్‌ అధ్యక్షులు పివిజె రాజు, డిప్యూటీ డివిజనల్‌ కోఆర్డినేటర్‌ చందన్‌ కుమార్‌లను డిఆర్‌ఎంకు పట్సహాని పరిచయం చేశారు. ఈ సందర్భగా పట్సహానీ మాట్లాడుతూ, కార్మిక సమస్యలను పరిష్కరించడంలోనూ, రైల్వేల ప్రగతిలో యాజమాన్యానికి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ ఎల్లప్పుడు సహకరిస్తుందన్నారు. అదే సమయంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాన్ని కూడా చేస్తుందని స్పష్టం చేశారు.కాగా ఈస్టుకోస్టు రైల్వే విశాఖ డివిజనల్‌ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పప్పల రామమోహనరావు 2018లోనే శ్రామిక్‌ కాంగ్రెస్‌ డివిజనల్‌ కోఆర్డినేటర్‌ గా పనిచేశారు. ఇప్పుడు రైల్వేలలో గుర్తింపు కలిగిన అతి పెద్ద కార్మిక ఫెడరేషన్‌ ఆల్‌ ఇండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌లో కూడా ఈ పదవిని అలంకరించడం విశేషం. రెండున్నర దశాబ్దాలుగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ నిజాయితీ నిబద్దతతో కూడిన కార్మిక పక్షపాతిగా కార్మికుల మన్ననలను పొందిన రామ్మోహనరావును పలువురు కార్మికులు, కార్మిక నేతలు అభినందించారు.

➡️