సమస్యలను పక్కన పెడితే ఉద్యమిస్తాం

Jun 17,2024 21:17

ప్రజాశక్తి – కొమరాడ : మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం అని టిడిపి మండల కన్వీనర్‌ శేఖర్‌ పాత్రుడు మాటలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వాగతిస్తూనే గత ప్రభుత్వం లాగా ఈ సమస్యలు పక్కన పెడితే రాబోయే రోజులలో ఉద్యమిస్తాం అని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మండలంలో ఏనుగులు సమస్య, అంత రాష్ట్ర రహదారి సమస్య, గిరిజన ప్రజలకు విద్య వైద్యం ఇతర మౌలిక వసతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఓటమి చెందిందని గుర్తు చేశారు. కొత్తగా ఎమ్మెల్యే అయిన జగదీశ్వరి స్థానిక సమస్యలతో పాటు తోటపల్లి నిర్వహితుల సమస్య, జంఝావతి రిజర్వాయర్‌, వనకాబడి రిజర్వాయర్‌, గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్‌ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు రామారావు, వెంకటేష్‌, శివుని నాయుడు, ఉపేంద్ర పాల్గొన్నారు.వాహనదారుల ప్రాణాలకు భరోసా ఎవరు?పార్వతీపురం నుంచి కోనేరు అంతర్‌ రాష్ట్ర రహదారిపై ప్రయాణాలు చేస్తున్న వాహనదారుల ప్రాణాలకు భరోసా ఎవరు అని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులు వద్ద నిరసన తెలియజేసి మాట్లాడారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఈశ్వరుని దేవాలయం వద్ద పెద్దపెద్ద గోతులు అంతరాష్ట్ర రహదారిపై ఉండటంతో ఆ గోతిలోని సోమవారం ఉదయం ఏడు గంటలకు కురిసిన వర్షానికి గోతుల్లో నీరు చెరువులు మాదిరిగా తయారయ్యాయని అన్నారు. పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతర్‌ రాష్ట్ర రహదారి మార్గంలో ఈ గోతుల్లో నీరు భారీగా చేరడం వల్ల ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లే లారీ ఆ గోతిలో దిగిపోవడంతో అటు ఇటు వెళ్లలేక అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ గోతులను ఈ నెల 20వ తేదీ లోపు కప్పకపోతే 21వ తేదీన ఆ గోతుల వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి వాహనదారుల ప్రాణాలకు భరోసా కల్పించే విధంగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉపేంద్ర పాల్గొన్నారు.

➡️