మహిళా హక్కులను కాపాడుకుందాం : అలివేలమ్మ

Mar 7,2024 14:49 #aidwa, #CITU, #Kurnool

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : అంతర్జాతీయ మహిళా సంఘం స్ఫూర్తితో మహిళా హక్కులను కాపాడుకునేందుకు ప్రతి నారి పోరాటాలకు సిద్ధం కావాలని మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలమ్మ పిలుపునిచ్చారు. గురువారం ఆదోనిలోని రెవెన్యూ భవన్‌లో ఐద్వా, సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అలివేలమ్మ మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందయని ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ కార్యరూపం దాల్చకుండా అడుగడుగునా మోకాలు అడ్డు వేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. చిన్నపిల్లలు, మహిళలపై దాడులు, వేధింపులపై చర్యలు తీసుకొని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంగా మహిళల సంక్షేమం కోసం పాటుపడతామని హక్కుల సంరక్షణ కోసం పని చేస్తామని అధికారంలోకి రాగానే విస్మరించడం పాలకులకు పరిపాటిగా మారిందన్నారు. మద్యం నిషేధం పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి దర్జాగా విక్రయిస్తూ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు రక్షణ చట్టాలు రూపకల్పన చేసిన అమలు పరచకపోవడం వల్ల దాడులు అఘాయిత్యాలు మితిమీరి పోతున్నాయన్నారు. హక్కుల సాధనకై ఉమ్మడి పోరాటాలకు మహిళలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు సుజాత, వరలక్ష్మి, అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటమ్మ, మహిళా సంఘం నాయకురాలు మక్బూల్‌ బాను, పద్మ, సరోజ, సోమక్క, కరుణ, శంకరమ్మ, గీత, శ్రీదేవి, ఉమా పాల్గొన్నారు.

➡️