భానుడు భగ..

Apr 17,2024 22:16

భఅల్లాడుతున్న జనం

నిర్మానుష్యంగా మారిన కూడళ్లు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఉ మ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగ భగలతో జనం అల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉదయం 9గంటల తరువాత బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. బుధవారం అత్యధికంగా పార్వతీపురం, సాలూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, విజయనగరంలో 41 డిగ్రీలు నమోదైంది. దీంతో జిల్లా కేంద్రాల్లోని రహదారులు, ప్రధాన కూడళ్లు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులున్న వారు మినహా మిగతా ఎవరూ బయటకు రావడం లేదు. ఎండను దష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఫిబ్రవరి రెండో వారం నుంచి భగభగలాడుతున్న సూర్యుడు ఏప్రిల్‌ ఆరంభం నాటికి తన ప్రతాపాన్ని పెంచేశాడు. గతవారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది ఇదే సమయానికి పగటి పూట 38నుంచి 40 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత మధ్య నమోదు కాగా ఈఏడాది 44 డిగ్రీలకు చేరుకుంది. నగరంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జనసంచారం తగ్గింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్ల మీద జనం చాలా తక్కువగా కనిపించారు. అత్యవసర పనుల విషయంలో మినహాయించి మిగతా సందర్భాల్లో రోడ్ల మీదకు వచ్చేందుకు జనం వెనుకాడుతున్నారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే కన్యకాపరమేశ్వరి కూడలి, కలెక్టరేట్‌, ఆర్టీసి కాంప్లెక్స్‌, పాట్‌ బస్టాండ్‌ ప్రాంతం, ఎమ్‌జి రోడ్డు, కలెక్టరేట్‌ ప్రాంతాలు మధ్యాహ్నం పూట నిర్మానుష్యంగా కనిపించాయి. మరోవైపు ఇళ్లల్లో ఉన్న సైతం వడగాల్పులకు ఇబ్బంది పడుతున్నారు. ఎసిలు ఉన్న వారు ఉదయం నుంచే వాని అన్‌ చేస్తూ సేద తీరుతున్నారు. ఎండ సమయంలో బయట ఎక్కువగా తిరగడం వల్ల పిల్లల్లో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, క్రీడాకారులు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు బయట తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ వంటివి తగలకుండా నీటిని ఎక్కువగా తీసుకుంటూ సాధ్యమైనంత వరకూ నీడలో ఉండాలని సూచిస్తున్నారు. బయట తిరిగే సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, రోజుకు ఐదు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచుకునేందుకు పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలని, వదులైన కాటన్‌ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నగర పాలక సంస్థ వేసవి ఎండ నుంచి ఉపశమనం ఎలా పొందాలి అని అంశాలపై రూపొందించిన కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ప్రాంతం ఉష్ణోగ్రత (డిగ్రీలలో) : విజయనగరం 41 పార్వతీపురం 44సాలూరు 44ఎస్‌.కోట 40రాజాం 43చీపురుపల్లి 39పాలకొండ 43

➡️