ఎంఎస్‌ఎంఇ సంస్థల సర్వే ప్రారంభం

Mar 1,2024 20:43

పార్వతీపురం : మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) సర్వే శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సర్వే వివరాల పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల అధికారి ఎంవి కరుణాకర్‌ సర్వే వివరాలు అందించారు. ఎంఎస్‌ఎంఇల పని తీరును మెరుగు, అభివృద్ధిని వేగవంతానికి కేంద్ర ప్రభుత్వ ర్యాంప్‌ పథకం కింద సర్వే జరుగుతుందని చెప్పారు. ఎంఎస్‌ఎంఇల సర్వే ద్వారా తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లోని సంస్థలను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చి ఎపిఎంఎస్‌ఎంఇ వన్‌ పోర్టల్‌ను అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. నమోదు కాని వ్యాపారాలను ఉద్యం, ఉద్యమ అసిస్ట్‌లో నమోదు చేయడం ఎంఎస్‌ఎంఇ ఫార్మలైజేషన్‌ ముఖ్యోద్దేశమన్నారు. పరిశ్రమల శాఖ ఎపి ఎంఎస్‌ఎంఇ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో సర్వే నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. సర్వే కోసం ఎం ఎస్‌ ఎం ఇ సర్వే అండ్‌ సపోర్ట్‌ అనే మొబైల్‌ ఆప్‌ ను రూపొందించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్‌ అమెనిటీ సెక్రటరీలు ఈ సర్వేను ఈనెల 20 వరకు చేపడతారని ఆయన చెప్పారు. ఎం ఎస్‌ ఎం ఇ అసోసియేషన్లు, ఇతర పరిశ్రమల అసోసియేషన్లు, వర్తక, వాణిజ్య సంఘాలు సర్వే టీమ్‌ కు సహకరించి సర్వేకు అవసరమైన వివరాలు అందించి సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు కల్పనా కుమారి, సి.విష్ణు చరణ్‌, ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, డిఆర్‌ఒలు కె.హేమలత, వెంకట రమణ, పరిశ్రమలశాఖ ఎడి పి.సీతారాం తదితరులు పాల్గొన్నారు.

➡️