ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 20:52

పార్వతీపురంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌ఒ రూబేనుకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, కార్మిక సంఘాల నాయకులు చీపురుపల్లి సింహాచలం, మామిడి శివతో కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె జరిగిందని, ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో మాట్లాడి చర్చలు జరిపిందని, కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని, కొన్ని జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్టు తెలిపారు. సమ్మె విరమణ జరిగి 15 రోజులవుతున్నా నేటికీ జీవోలు అమలు చేయలేదన్నారు. కార్మికులందరికీ రూ.21వేలు వేతనం చెల్లించాలని, డ్రైవర్లందరికీ రూ.24,500 చెల్లించాలని, పర్మినెంట్‌ కార్మికులకు సరెండర్‌ లీవుల బకాయిలు చెల్లించాలని, స్కూల్‌ స్లీపర్లందరికీ 23శాతం వేతనం పెంచాలని, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ జిఒలన్నీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సాలూరు: మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం వెంటనే జీవోలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 రోజుల సమ్మెను వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తూ జీవో ఇంతవరకు జారీ చేయలేదని చెప్పారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో కుదిరిన ఒప్పందం మేరకు జీవోలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు టి.రాముడు, టి.శంకరరావు, పోలరాజు, స్వప్న, రవి పాల్గొన్నారు.పాలకొండ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె పోరాట ఒప్పందాలు, జీవోలు, వెంటనే విడుదల చేయాలని, డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ పాలకొండ కమిటీ గౌరవాధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు పడాల. భాస్కరరావు, చింతల. సంజీవి, సురేషు రఘు, శ్రీదేవి, విమల ,తదితరులు నాయకత్వం వహించారు సిఐటియు పాలకొండ మండల కమిటీ కార్యదర్శి కాదా రాము వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నాయకులు దూసి దుర్గారావు తదితరులు.కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️