గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

Jan 2,2024 22:07

కురుపాం: మండలంలోని గిరి శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శిలు బి.వాసుదేవరావు, బి.అనిల్‌ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని వలసబల్లేరు సచివాలయం వద్ద మంగళవారం రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలైన చాపరాయిగూడ, కొత్తగూడ గిరిజన ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి నేటికీ 76 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజన ప్రజల తలరాతలు మారడంలేదన్నారు. అధికారులకు గాని పాలకులకు గాని గిరిపుత్రుల సమస్యలు పట్టడం లేదని రహదారి మంజూరులో ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ పనులు ప్రారంభించడం లేదని తక్షణమే రహదారి పనులు ప్రారంభించి గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దుంబారావు, భోగేష్‌, అడ్డాయి తదితరులు పాల్గొన్నారు.

➡️