జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు

Jan 22,2024 21:12

పార్వతీపురం : జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియ ఈనెల 12తో ముగిసింది. తుది ఓటరు జాబితా ప్రచురణ ప్రతిని సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం జిల్లాలో 1031 పోలింగ్‌ కేంద్రాల్లో తుది ఓటర్ల జాబితాలో 3,78,764 మంది పురుషులు, 3,96,766 మంది స్త్రీలు, 68 మంది థర్డ్‌ జెండర్‌ వెరసి ఓటర్లు 7,75,598గా నమోదైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తప్పుల్లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు శాయశక్తుల కృషి చేశామన్నారు. ఇందులో పాలకొండ (ఎస్‌.టి) నియోజక వర్గంలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్‌ జెండర్‌ వెరసి 1,93,667 మంది ఓటర్లు ఉన్నారు. కురుపాం (ఎస్‌.టి) నియోజక వర్గంలో 93,592 మంది పురుషులు, 99,005 మంది మహిళలు, 39 మంది థర్డ్‌ జెండర్‌ వెరసి 1,92,636 మంది ఓటర్లు, పార్వతీపురం (ఎస్‌.సి) నియోజక వర్గంలో 92,655 మంది పురుషులు, 95,188 మంది మహిళలు, 11మంది థర్డ్‌ జెండర్‌ వెరసి 1,87,854 మంది ఓటర్లు, సాలూరు (ఎస్‌.టి) నియోజక వర్గంలో 98,189 మంది పురుషులు, 1,03,248 మంది మహిళలు, 4 థర్డ్‌ జెండర్‌ వెరసి 2,01,441 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలో 1316 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 382 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినట్లు, 358 మంది ఎక్కువ సార్లు ఓటరుగా నమోదైనట్లు గుర్తించా మని వివరించారు. 2,314 ఫిర్యాదులందక ముందుగానే విచారణ చేసి తొలగించామని ఆయన చెప్పారు. 16,255 మంది తమ చిరునామాలోనే ఉన్నట్లు గుర్తించినట్టు చెప్పారు. ఫారం 6,7,8 దరఖాస్తులను నామినేషన్ల చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తుది ఓటరు జాబితా అన్ని పోలింగ్‌ కేంద్రాలు, సహాయ ఓటరు నమోదు, ఓటరు నమోదు అధికార్లు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విచారణ నిమిత్తం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఒకటి, ఫోటోలు లేకుండా ఉన్న ఓటరు జాబితా ఒకటి ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️