తగ్గుతున్న చెరకు సాగు

Jan 17,2024 21:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ విధానాల కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్రమంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తగినంతగా సాగులేదని సాకుచూపుతూ ఉన్న పరిశ్రమలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో, సాగు రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తూ అష్టకష్టాలతో సంకిలి ఫ్యాక్టరీకి తరలించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు చెరకు సాగుకు పెట్టింది పేరు. పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడంతో నీటి వసతిలేమిని ఎదుర్కొనే చెరకు, గోగు, జనుములు విస్తారంగా పండేవి. అందుకే సుమారు 20కిపైగా జూట్‌ మిల్లులు, ఇటు భీమసింగి, అటు లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీలు జిల్లాలో ఉండేవి. నిత్యం కార్మికులతో కళకళలాడేవి. ఇటు చెరకు, గోగు రైతులు కూడా ఉత్సాహంగా సాగుచేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. మారిన ప్రభుత్వ విధానాల కారణంగా మద్ధతు ధర లేకపోవడంతో దాదాపు గోగు, జనుముల సాగు క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా గోగు నార కొనుగోలు కేంద్రాలు (సిసిఎఫ్‌), జ్యూట్‌ మిల్లులు దాదాపు కనుమరుగయ్యా యి. ఈ సంగతి కాస్త పక్కనబెడితే…. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో చెరకు సాగు సాగువిస్తీర్ణం 50వేల ఎకరాలకుపైగా ఉండేది. సాగులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర కల్పించకపోవడం, గత పదేళ్లగా కొత్తగా పరిశోధనలు చేపట్టకపోవడం వంటి కారణాల వల్ల వల్ల ఫ్యాక్టరీల్లో రికవరీ తగ్గిపోయింది. దీంతో, రైతులు క్రమంగా చెరకు సాగును తగ్గించుకుంటున్నారు. 2014-15లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరకు సాధారణ విస్తీర్ణం 37,297 ఎకరాలుకాగా, ప్రస్తుతం 11,265 ఎకరాలకు తగ్గింది. దీన్నిబట్టి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26,032 ఎకరాలు తగ్గిపోయినట్టు స్పష్టమౌతోంది. రాష్ట్రంలో చెరకు పరిశోధనలు గడిచిన రెండు దశాబ్ధాలకాలంగా జరగడం లేదు. ఫలితంగా సుమారు పదేళ్లగా కొత్తరకం విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల దిగుబడి కూడా సగానికి సగం తగ్గిపోతోంది. సుగర్‌ రికవరీ రేటు కూడా మన రాష్ట్రంలో 9.5శాతానికి మంచిరావడం లేదు. మరోవైపు చెరకు రైతులకు సబ్సిడీ పథకాలు లేవు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై మద్ధతు ధర ప్రకటించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. ధరలో లోటును భర్తీచేసే చెరకు పాలసీని కూడా పదేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో, జిల్లాలో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో 60వేల ఎకరాల నుంచి 11వేల ఎకరాలకు తగ్గింది. అనివార్యంగా ఉత్పత్తి కూడా అదే స్థాయిలో తగ్గింది. ఇందుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం సాగు, దిగుబడి తగ్గడాన్ని బూచిగా చూపి ఏకంగా పరిశ్రమలనే మూసివేసింది. రియల్‌ఎస్టేట్‌గా మార్చేందుకు కంకణం కట్టుకుంది. తొలుత ఆధునీకరణతో పేరుతో భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామర్థ్యానికి తగ్గ చెరకు అందుబాటులో లేకపోవడం వల్ల తెరిపించలేమని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. పైగా రైతులే తగినంతగా చెరకు పండించడం లేదంటూ బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో ధర కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అంటూ ఎపి రైతు సంఘం, సిపిఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి ఆధ్వర్యాన చెరకు రైతులు సుదీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? రాష్ట్రంలోనైనా పెంచే ఆలోచన ఎందుకు చేయడం లేదు? తమకు ఇస్తున్న ప్రోత్సాహకాలేమిటి? అని చెరకు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం సుగర్‌ ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం లేదా రియల్‌ ఎస్టేట్‌గా మార్చడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఎపి రైతు సంఘం, చెరకు రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టే సీతానగరం పరిధిలోని ఎన్‌సిఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేశారు. వీటిని అధికార పార్టీకి చెందిన నాయకులే వసపర్చుకున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సుమారు 40 నుంచి 60కిలో మీటర్ల దూరంలోవున్న రేగిడి మండలం సంకలి సుగర్‌ ఫ్యాక్టరీలో క్రిషింగ్‌ ఏర్పాట్లు చేశామని ఉచిత సలహాలు ఇస్తోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2014 నుంచి చెరకు సాగు
సంవత్సరం విస్తీర్ణం (ఎకరాల్లో)
2014-15 37,297
2015-16 34,230
2016-17 33,180
2017-18 31,19
12018-19 29,237
2019-20 22,407
2020-21 14,88
22021-22 12,190
2022-23 11,265

➡️