మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 2,2024 21:07

ప్రజాశక్తి – సీతానగరం : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎంఇఒ-2 ఎం.వెంకటరమణకు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి వై.శాంతికుమారి మాట్లాడుతూ దీర్ఘకాలంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని, దీంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వంట నిర్వహణకు అవసరమైన గ్యాస్‌ బండ, పొయ్యిలు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం తరచూ మెనూ మారుస్తున్నప్పటికీ మెస్‌ ఛార్జీలు చెల్లించడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెనూ ఛార్జీలు, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ఈనెల 5న కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో మండలానికి చెందిన మధ్యాహ్న భోజన కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ మధ్యాహ్న భోజన నిర్వాహకుల మండల యూనియన్‌ నాయకులు యాళ్ల సావిత్రి, ఎస్‌.లక్ష్మి, అప్పనమ్మ, చిన్నమ్మ, సీతారత్నం తదితర వంట నిర్వాహకులు పాల్గొన్నారు. కొమరాడ : మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయుకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికసంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ఉన్న ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ సౌజన్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబమూర్తి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు సునీత, లక్ష్మి మాట్లాడుతూ మండలంలోని వివిధ స్కూల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. ఇప్పటికైనా మెనూ ఛార్జీలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ఈనెల 5న కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో మండలానికి చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొన్నారు.

➡️