మున్సిపల్‌ కార్మికుల సమ్మె’ట’

Dec 25,2023 21:31

సాలూరు : మురికిలో మురికై, కంపునే ఇంపుగా చేసుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పని చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. గడచిన నాలుగున్నరేళ్లలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 26 నుంచి విధులకు దూరంగా ఉండబోతున్నారు. పాలకుల దృష్టిని ఆకర్షించడానికి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి చివరికి సమ్మెబాట పట్టిన కార్మికుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. సరిగ్గా నాలుగున్నర ఏళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా ఇప్పుడున్న సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పట్టణానికి వచ్చారు. మున్సిపల్‌ మహిళా పారిశుధ్య కార్మికుల చేతిలో చెయ్యేసి సాగించిన పాదయాత్ర తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్రంలోని వేలాదిమంది కార్మికులు భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పకుండా మడమ తిప్పకుండా హామీలను నెరవేర్చుతారని గడిచిన నాలుగున్నర ఏళ్ల పాటు వేచి చూశారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని చెప్పిన మాట నేటికీ నీటిమూటగా మిగిలి పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ, నగరపంచాయతీల్లో ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ దశలవారీగా పోరాటాలు నిర్వహించారు. ఈ ఏడాది గతంలో పనిచేసిన మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రస్తుత మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, డిఎంఎ కోటేశ్వరరావుతో ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు దఫదఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల ఈనెల 14న చర్చలు జరిగిన హామీల అమలు పట్ల నిర్ధిష్టత కొరవడింది. 2022 జులైలో జరిగిన ఐదురోజుల సమ్మె సందర్భంగా ఇంజినీరింగ్‌ కార్మికులకు ప్రతిపాదించిన జీతాలు చెల్లించలేదు. ప్రజారోగ్యశాఖలో చెత్తలను తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలో పని చేస్తున్న కార్మికులకు గత మూడేళ్లుగా హెల్త్‌ అలవెన్సులు చెల్లించడం లేదు. ఆప్కాస్‌లో మున్సిపల్‌ కార్మికులను విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ సంక్షేమ పథకాలకు కోత విధించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, కరువు భత్యం, సరెండర్‌ లీవులు, గ్రాట్యుటీ, పెన్షన్‌ వంటి సౌకర్యాలేవీ అమలు చేయడం లేదు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలుగడిచిన నాలుగున్నరేళ్లలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో పోలిస్తే మున్సిపల్‌ కార్మికుల జీతాలు గొర్రెతోక బెత్తెడులాగే మిగిలాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాంసం, చేపలు, వంటనూనె, గ్యాస్‌ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు 200శాతం నుంచి 300శాతం పెరిగాయి. కానీ కార్మికుల జీతం 12,000 నుంచి 15000 రూపాయలకు మాత్రమే పెరిగింది. అంటే 25 శాతం మాత్రమే జీతాలు పెరిగాయి. ధరలు ఆకాశాన్ని తాకిన విధంగా పెరిగితే కార్మికుల జీతాలు పాతాళంలోనే వుండిపోయాయి. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పారిశుధ్య నిర్వహణపై సమ్మెట దెబ్బరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లో కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 26నుంచి సమ్మెకు దిగుతుండడంతో పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపనుంది. పండగల సమయంలో కార్మికులు సమ్మెకు వెళ్లడం వల్ల పారిశుధ్య పనులు స్తంభించిపోయే అవకాశం ఉంది. కార్మికులతో పాటు క్లాప్‌ ఆటోల డ్రైవర్లు, సిపిఎస్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. సాలూరు మున్సిపాలిటీలో 140 మంది, పార్వతీపురంలో 150 మంది, పాలకొండ నగరపంచాయితీలో వంద మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.డిమాండ్లు ఇవేశ్రీ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి శ్రీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి శ్రీ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి శ్రీ ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌, రిస్క్‌ అలవెన్సులు చెల్లించాలి శ్రీ క్లాప్‌ ఆటో డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 చేయాలి శ్రీ ఆప్కాస్‌లో ఉన్న మున్సిపల్‌ ఉద్యోగులకు, కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి శ్రీ పర్మినెంట్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేయాలి శ్రీ విలీన పంచాయతీలు, కరోనా, వరదలు వంటి విపత్తుల సమయంలో తీసుకునే కార్మికులకు ఆప్కాస్‌ జీతాలు, అలవెన్సులు చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమ్మెరాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం వల్లనే మున్సిపల్‌ కార్మికులు అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడచిన మూడు నెలలుగా కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో గానీ, చర్చలు జరపడంలో గానీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తగా కోరిన కోరికలు ఏమీ లేవు. కార్మికుల సమ్మెకు ప్రజలు మద్దతు తెలపాలి.ఎన్‌వై నాయుడు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి

➡️