మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన వైసిపి

Mar 8,2024 21:47

పార్వతీపురంరూరల్‌ : ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం అటకెక్కించిందని, గతంలో ముస్లింల కోసం టిడిపి అమలు చేసిన పథకాలను రద్దు చేస్తూ వారికి అన్యాయం చేసిందని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో గల మసీదును ముస్లింల కోరికపై సందర్శించారు. ఈ సందర్భంగా టిడిపి విజయం కోసం ముస్లిం పెద్దలు ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ ముస్లిం కుటుంబాల సంక్షేమానికి తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెడతామని అన్నారు. వీరికి అవసరమైన షాదీ ఖానాల నిర్మాణంతో పాటు ఆర్థికంగా వారి ఎదుగుదలకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలను అందేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం నాయకులు మాట్లాడుతూ టిడిపి హయాంలో తమకు రంజాన్‌ కానుకలతో పాటు ఇతర పథకాలు అందగా ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని రాబోయే ఎన్నికల్లో తాము టిడిపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ టిడిపి నాయకులు మజ్జి కృష్ణమోహన్‌, మజ్జివెంకటేష్‌, పోల సత్యనారాయణ, సింహాలనాయుడు, శ్రీరాములు, మధు, గుండ్రెడ్డి రవి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

➡️