వాలంటీర్ల సేవలు మరువలేనివి : కలెక్టర్‌

Feb 15,2024 20:05

పార్వతీపురం: ఆపత్కాల సమయాల్లో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ గ్రామస్వరాజ్యాన్ని అందించే క్రమంలో వాలంటీరు పాత్రకీలకమని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అవసరమైన వారి చెంతకు చేర్చడం, పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తీసువస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్‌ మట్లాడుతూ వాలంటీర్లకు వందనం కార్యక్రమం ద్వారా వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం 50 శాతం పెంచి సేవావజ్ర అవార్డుకు రూ.45వేలు, సేవారత్న అవార్డుకు రూ.30 వేలు, సేవా మిత్ర అవార్డుకు రూ.15వేలు అందించడం సంతోషదాయకమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వాలంటీర్లలో 5368 మంది సేవా మిత్రకు, 90 మంది సేవా రత్నకు, 20 మంది సేవా వజ్ర విశిష్ట సేవలకు వెరశి 5478 మంది ఎంపికయ్యారని తెలిపారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ, స్వలాభేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం సేవా వజ్రలకు ఎంపికైన 20 మంది వాలంటీర్లకు రూ. 45వేలు నగదు, ధ్రువపత్రం, మెడల్‌, శాలువా అందజేశారు. అలాగే సేవారత్నకు రూ.30వేలు నగదు, ధ్రువపత్రం, మెడల్‌, శాలువా, సేవామిత్రకు రూ.15వేలు, ధ్రువపత్రం, మెడల్‌, శాలువా బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️