వినతులను వెంటనే పరిష్కరించాలి

Dec 11,2023 20:37

పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని జాయింటు కలెక్టరు ఆర్‌. గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జెసితో పాటు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావుతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలోని సమస్యలకు అక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మక్కువ మండలం డి-శిర్లాం గ్రామానికి చెందిన చెల్లారపు నారాయణకు రూ.3,500 విలువ చేసే వినికిడియంత్రాన్ని జాయింటు కలెక్టరు అందజేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 126 వినతులను ప్రజలు సామాజిక, వ్యక్తిగత సమస్యలపై అందజేశారు. స్వీకరించిన దరఖాస్తులు కొన్ని… పార్వతీపురం నుంచి వీరఘట్టం రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, అందువల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ రహదారికి ఇరువైపుల రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని టిడిపి గరుగుబిల్లి మండల అధ్యక్షులు అక్కేన మధుసూదనరావు కోరారు. పాచిపెంట మండలం ఈతమానువలసలో తుపాను ప్రభావం వల్ల వంట గదులు కూలిపోయాయని, గ్రామానికి రక్షణ గోడను మంజూరు చేయాలని గ్రామస్తులు, సర్పంచ్‌ కె.బాబూరావు వినతిని అందజేశారు. పార్వతీపురం పట్టణం అమ్మిగారి కోనేరు గట్టు వీధి నాలుగో వార్డులో ప్రభుత్వం అందించే రేషన్‌ సరిగ్గా అందడం లేదని, రేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పి.గౌరి, డి.భారతి దరఖాస్తు అందజేశారు. బలిజిపేట మండలం అరసాడకు ఎ.సునీత వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు కానుక మంజూరు చేయాలని కోరారు. సాలూరుకు చెందిన ఎం.జగదీశ్వరరావు సర్వేనెంబర్‌ 360 లో 80 సెంట్లు భూమి ఆన్లైన్లో వేరే వారి పేరున చూపిస్తుందని, రీ సర్వే జరిపించి తన భూమిని తనకు అప్పజెప్పాలని వినతిని అందజేశారు. గరుగుబిల్లి మండలం చినగుడబకు చెందిన జి.గంగమ్మ సర్వే నంబర్‌ 80లో గల మెట్టు భూమిని 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఆ భూమికి రీ సర్వే జరిపించి పాస్‌ బుక్‌ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. పాచిపెంట మండలం గుంట మామిడి వలస గ్రామానికి చెందిన సి.హెచ్‌ లక్ష్మణ రావు కిరాణా షాప్‌ కొరకు పిటిజి లోన్‌ మంజూరు చేయాలని కోరారు. కొమరాడకు చెందిన ఎస్‌.ఉదరు శేఖర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రంగు మారినా గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని అర్జీ అందజేశారు. వీరఘట్టం మండలం తెట్టంగికి చెందిన జి.సింహాచలం రైస్‌ కార్డులో తన పేరును యాడ్‌ చేయాలని దరఖాస్తు అందజేశారు. ఐటిడిఎ పరిధిలోని ఎపిటిడబ్ల్యూఆర్‌ఇఐఎస్‌ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో సెక్యూరిటీ సిబ్బంది ని విధుల్లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సేవా సంఘం అధ్యక్షులు మంచాల ఈశ్వరరావు,ఇతరులు దరఖాస్తు అందజేశారు. లికొమరాడ మండలం రామభద్రపురం గ్రామానికి చెందిన మురళీకృష్ణ పార్వతీపురం – రాయగడ జాతీయ రహదారి పక్కన రామభద్రపురం గ్రామానికి ఆనుకొని ఉన్న చెట్టును తొలగించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️