ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు

May 13,2024 22:26

పార్వతీపురంరూరల్‌/టౌన్‌ : మండలం, పట్టణంలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని బారులు తీరి క్యూలైన్లు కనిపించాయి. మండలంలోని నర్సిపురం, వెంకటరాయుడిపేట, బాలగోడబ, అడ్డాపుసిల గోపాలపురం, కృష్ణపల్లి, వెంకంపేట, పెదమరికి, ఎల్‌ఎన్‌ పురం, సంగంవలస పోలింగ్‌ బూతుల దగ్గర అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. గిరిజనులు అధికంగా ఉండే రావికోన, బట్టివలస, రంగాలగూడ గ్రామాల్లో గిరిజనులు భారీ సంఖ్యలో తరలి రావడంతో మధ్యాహ్నానికి పోలింగ్‌ ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో 50 శాతానికి దాటడం విశేషం. పెద్ద బొండపల్లి, చిన్న బొండపల్లి, ఎంఆర్‌ నగరంలో కేంద్రాలకు అధిక సంఖ్యలో ఓటర్లు హాజరయ్యారు. మధ్యాహ్నం 3గంటలకు నియోజకవర్గ ఓటింగ్‌ 55 శాతానికి చేరుకోగా, సాయంత్రం 6 వరకు ఓటింగ్కు అవకాశం ఉన్నందున పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణంలోని వివేకానంద కాలనీ, మున్సిపల్‌ పాఠశాలల్లో పోలింగ్‌ సమయంలో ముగిసినా రాత్రి 9గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ప్రశాంతంగా పోలింగ్‌ బలిజిపేట: మండలంలోని 24 పంచాయితీల్లో గల 67 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఎండ తీవ్రతను బట్టి సుమారు 12 గంటల నుండి 3.30 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా నడిచిన ఆ తర్వాత పోలింగ్‌ పుంజుకుంది. అక్కడక్కడ చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు సమన్వయంతో ఎన్నికలను ముందుకు నడిపించారు. మండలంలోని ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అయిన అలజంగి జోగారావు తన సొంత గ్రామమైన చిలకలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా పోలీస్‌ సిబ్బంది, ఇతర అధికారులు సమన్వయంతో పని చేశారని అభినందించారు.సీతానగరం : మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 46,763 మంది ఓటర్లకు గానూ సుమారు 36వేల వరకు ఓట్లు నమోదయ్యాయి. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మండలంలోని సీతానగరం, చినబోగిలి పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట సిఐ కె.రవికుమార్‌, ఎస్సై ఎం.రాజేష్‌ ఉన్నారు. చిన్న భోగిలలో ఓట్లు వేసేందుకు రాత్రి 8 గంటల వరకు ఓటర్లు నిరీక్షించారు.

➡️