ఆరోగ్యసురక్షలో నేత్ర పరీక్షలు

Apr 12,2024 21:24

పార్వతీపురంరూరల్‌ : ఆరోగ్య సురక్ష శిబిరంలో భాగంగా శుక్రవారం నర్సిపురంలో జరిగిన వైద్యశిబిరంలో నేత్ర వైద్య పరీక్షలను జిల్లా కంటి వెలుగు సెల్‌ నేత్ర వైద్యాధికారి నగేష్‌ రెడ్డి పర్యవేక్షించారు. కంటి వైద్య సహాయకులు ఉమామాహేశ్వరి పరీక్షలు నిర్వహించి ముగ్గురికి అంతర కుసుమం, ఇద్దరికి కొయ్యకండ, 18 మందికి దృష్టి దోషం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని, అలాగే దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా త్వరలో కళ్ల జోళ్లు అందిస్తామని, సాధారణ వ్యాధులకు మందులతో చికిత్స అందించినట్లు నగేష్‌రెడ్డి తెలిపారు. అనంతరం స్థానిక వైద్యధికారి డాక్టర్‌ ఎన్‌ఎంకె తిరుమలప్రసాద్‌ ఆధ్వర్యంలో సాధారణ వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణీలు, బాలంతలు, చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు అనంతరం వారికి కావాల్సిన మందులు అందజేశారు. గర్భిణులకు హిమోగ్లోబిన్‌, బిపి, షుగర్‌ పరీక్షలు చేసి రక్తం తక్కువగా ఉన్న వారికి ఐరన్‌ టాబ్లెట్లు ఇచ్చారు. హిమోగ్లోబిన్‌ పెరిగేంత వరకూ వారిని పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే పిహెచ్‌సికి తీసుకొని రావాలని సూచించారు. ఈ శిబిరంలో ఎముకుల వైద్యులు, చెవి ముక్కు వైద్యలు, కంటికి సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే ఎండలు తీవ్రతగా ఉన్నందున వీలైనంత వరకూ ఇంటి నుండి బయటకు రాకూడదని సూచించారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్‌ వైద్యులు శేషగిరిరావు, ఎస్‌.కోటేశ్వరరావు, సూపర్వైజర్‌ జయగౌడు, నాగమ్మ, అమరావతి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️