కాసుల పంటగా మారుతున్న ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు

Jun 17,2024 21:34

కురుపాం: స్థానిక మేజర్‌ పంచాయతీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు వారికి కాసుల పంటగా మారుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన అధిక మొత్తం పలువురు అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయనేది బహిరంగ విమర్శ. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఏదైనా సంస్థ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌ వేయాలంటే ముందు గా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ప్లానింగ్‌ అప్రూవల్‌ టౌన్‌ ప్లానింగ్‌ శాఖకు తమ లేవుట్‌లో రహదారి, మురుగు కాల్వలు, తాగునీటి, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసిన వివరాలు అందజేసి వారి క్షేత్ర స్థాయిలో సందర్శన తర్వాత ప్రభుత్వానికి కొలతలు ప్రాప్తికి సూచించిన మొత్తం చెల్లించి అనుమతి పొందాలి. కానీ కురుపాం మేజర్‌ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పుట్టగోడుగుల్లా వెలసిన రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఖజానాకు చేరిన మొత్తం అరకొర మాత్రమేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా రెవెన్యూ శాఖకు ముందే ల్యాండ్‌ కన్వర్షన్‌ అనుమతులు, లేఅవుట్‌ వేసేందుకు అనుమతి తీసుకోవాలి. కానీ ఫిర్యాదులు అందిన ప్రతిసారీ సర్వేయర్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ క్షేత్ర స్థాయిలో తూతూ మంత్రంగా పరిశీలన చేసి నోటీసులు జారీ చేసి రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన మొత్తం సొంత జేబుల్లో నింపుకుంటున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దగాకోరుతనానికి అడ్డూ ఆపులేకుండా పోయి సామాన్య ప్రజలకు అందని ఎత్తులో స్థలాలు ధరలు చేరుకుని ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎలాగూ ఏర్పడిన అనధికార బంధాన్ని ఆసరాగా చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ల్లో ప్రభుత్వ, అసైన్డ్‌, డి పట్టా భూములను కలుపుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు ఓ ఉన్నతాధికారి ఏకంగా రామదాసు అవతారం ఎత్తి తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రహరీగోడ, కార్యాలయం ముందు రేకులు షెడ్‌, ఆఫీసుకు అవసరమైన ఏర్పాట్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో తలపండిన మాజీ ప్రజాప్రతినిధి ద్వారా నిర్మించేశారు. ఎన్నికలు సమయంలో ఎలాంటి నిధులు లేకుండా జరిగిన నిర్మాణాలకు డబ్బు ఎలా వచ్చింది? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా చేయడం తప్పు అని మందలించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏదో ఒక విధంగా ప్రహారీ నిర్మాణం పూర్తి చేయాలని తర్వాత బాధ్యతలు స్వీకరించిన అధికారిని నోటి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే మిగిలిన పనులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారి ప్రహరీ గోడను పూర్తి చేసి రంగులు వేసి ఉన్నతాధికారి వద్ద ప్రశంశలు పొందారు. గతంలో పని చేసిన ఓ అధికారి మ్యుటేషన్‌కు ముందుగా డబ్బు భారీగా తీసుకుని పక్క మండలానికి బదిలీపై వెళ్లిపోగా ఎన్నికల సమావేశానికి వచ్చిన సమయంలో సదరు అధికారిని బహిరంగంగా నిలదీసి ద్విచక్ర వాహనం అడ్డుకోరగా యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేసి పెట్టారు. గతంలో అడపాదడపా రెవెన్యూ కార్యాలయాలపై ఎసిబి సోదాలు నిర్వహించి హెచ్చరించినప్పటికీ బేఖాతరుగా ఉన్న అధికారులు ఈ నూతన ప్రభుత్వంలో తీరు మార్చుకుంటారో …పాత అక్రమార్జన ధోరణి కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.రెవెన్యూ సేవలకు ధరలు పట్టిక పాటించాల్సిందేస్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో సామాన్యులు రెవెన్యూ సేవలు పొందాలంటే వారు గత ఏడాది ఏర్పాటు చేసిన నూతన ధరల పట్టిక పాటించాల్సిందే. లేకుంటే సేవలు అక్కర్లేదని దూరంగా ఉండిపోవాల్సిందేనన్న బహిరంగ ఆరోపణలు ప్రజలు నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మ్యుటేషన్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, ల్యాండ్‌ సర్వే ఇలా ప్రతి దానికి ఓ ధర నిర్ణయించారు. దాన్ని ఫాలో అయితే యువ అధికారి రంగంలోకి దిగి సర్వంతానై రెవెన్యూ కరుణా కటాక్షం చూపిస్తారు. లేదంటే కాళ్లరిగేలా రెవెన్యూ ప్రదక్షిణలు చేయాల్సిందే. కాసుల వర్షం కురిపించే వారికి ఎదురుగా వెళ్లి రెడ్‌ కార్పెట్‌ వేసి ఉత్సాహం చూపుతున్న వీరు సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్న వైనంపై మండి పడుతున్నారు. గతంలో ఎసిబిని సైతం ఆశ్రయించే స్థాయిలో విసిగిపోయారు.

➡️