ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 1,2024 21:54

గుమ్మలక్ష్మీపురం  : మే 13న జరగనున్న ఎన్నికల్లో ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న కురుపాం నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పల నరసను గెలిపించి గిరిజన హక్కులను కాపాడుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బారావమ్మ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్విన్‌పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలో పదేళ్లు పాటు బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ముఖ్యంగా గిరిజనుల పట్ల వివక్షత చూపుతూ పలు రాష్ట్రాల్లో వారిపై దాడులు చేయించడం, గిరిజనులకు ఉన్న హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ రక్షణ లేకుండా చేస్తుందని విమర్శించారు. జిఒ 3 రద్దు చేసిందని, 1/70 చట్టం పట్టష్టంగా అమలు కావడంలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని గిరిజనులకు వివరించారు. ఒకవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరో వైపు నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందన్నారు. మతతత్వ విధానాలతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇటువంటి తరుణంలో గిరిజనుల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటాలు సాగిస్తున్న సిపిఎం అభ్యర్థులను చట్టసభలకు పంపిస్తే హక్కులు, చట్టాలను కాపాడుకోగలం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌, నాయకులు పువ్వుల మోహనరావు, పాండురంగారావు, ఆడిట్‌, బిడ్డిక శంకర్రావు, సిఐటి మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, ఎంఎం నూకయ్య, పి.శ్రీరాములు, పి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.

➡️