తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ప్రజాశక్తి – రాయచోటి వేసవి దష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాల యం నుంచి విద్యుత్‌ సరఫరా, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా కరువు మండలాల్లో వేజ్‌ జనరేషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, గ్రామీణ నీటి సరఫరా ద్వారా తాగునీటి ఎద్దడి నివారణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమానికి రాయచోటి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. విసి అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రాయచోటి, సుండుపల్లె తంబళ్లపల్లె, పెద్దమండెం, బి కొత్తకోట, రామసముద్రం, పీలేరు నియోజకవర్గాలలో 13 మండలాలలో తాగునీటి సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున బోర్‌ వెల్స్‌, హ్యాండ్‌ పంప్స్‌ రీఛార్జ్‌ పునరుద్ధరణ పనులను పర్యవేక్షణ చేయాలని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి పనులను విరివిగా చేపట్టాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు సూచించారు. ముఖ్యంగా కరువు మండలాలలో ప్రత్యేక దష్టి సారించి ఇప్పటికే ఆమోదం పొందిన సెల్ఫ్‌ ఆఫ్‌ గ్రూప్‌ పనులను ముమ్మరం చేయాలన్నారు. హౌసింగ్‌లో 90 రోజుల పనులు పూర్తయిన వాటికి బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా వ్యక్తిగతంగా ఇళ్లముందర సోక్‌ పిట్‌ ఏర్పాటు చేసుకునేలా విస్తతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేసవికాలం దష్ట్యా విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని డిమాండ్‌ మేరకు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు అనంతరం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా తగిన పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

➡️