పిఎం జన్‌మన్‌కు మెట్టపాలెం ఎంపిక

పిఎం జన్‌మన్‌

 

పిఎం జన్‌మన్‌కు మెట్టపాలెం ఎంపిక

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు, సిపిఎం

ప్రజాశక్తి- అనంతగిరి : ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పిఎం జన్‌మన్‌) పథకం కింద మండలంలోని చిలకగెడ్డ పంచాయతీ మెట్టపాలెం ఆదివాసీ గిరిజన గ్రామాన్ని ఎంపిక చేయడంపై స్థానిక పివిటిజిలు, సిపిఎం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మెట్టపాలెంలో సర్పంచ్‌ మజ్జి అప్పారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. జన్‌మన్‌ కింద మెట్టపాలేన్ని ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.గ్రామంలో 39కుటుంబాలకు చెందిన 133మంది పివిటిజి గిరిజనులు నివసిస్తున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు, జన్‌మన్‌ పథకం కింద వారి సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపట్టడంతోపాటు గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ పథకం కింద పిఎం ఆవాస్‌లో గృహనిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్యసంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారులు, సమాచార వ్యవస్థ వంటి పథకాలను చేరువచేయడం ద్వారా వారి స్థిరమైన జీవనోపాధిని మెరుగుపరిచే చర్యలు చేపట్టనున్నారు. పాడేరు ఐటిడిఎ పరిధిలో మెట్టపాలం గ్రామాన్ని పిఎం జన్‌మన్‌ కింద ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో తాటిపూడి డ్యాంలో భూములు కోల్పోయిన తాము చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నామని, గ్రామంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని. గ్రామంలో ఉన్న 33/11 కెవి విద్యుత్‌ వైర్లు తొలగించాలని. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, జిలుగురుపాడు నుండి రోడ్డు నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని కోరారు. గ్రామసభలో ఎంపిడిఒ నాగేష్‌, ఎంఆర్‌ఐ శంకరరావు, ఎంపిటిసి టి మిథుల, పలుశాఖల అధికారులు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవింద్‌ పాల్గొన్నారు.

గ్రామసభలో మాట్లాడుతున్న సిపిఎం నేత గోవింద్‌

➡️