కసుమూరు దర్గాలో ఎంఎల్‌ఎ సోమిరెడ్డి పూజలు

Jun 17,2024 20:35
కసుమూరు దర్గాలో ఎంఎల్‌ఎ సోమిరెడ్డి పూజలు

ప్రార్థనలు చేస్తున్న ఎంఎల్‌ఎ సోమిరెడ్డి
కసుమూరు దర్గాలో ఎంఎల్‌ఎ సోమిరెడ్డి పూజలు
ప్రజాశక్తి-వెంకటాచలం:దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలి దర్గాను సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన శుభ సందర్భంగా సోమిరెడ్డి కసుమూరు దర్గాను దర్శించుకోవడం విశేషం. పూలవర్షంగా, మేళ తాళాల నడుమ సోమిరెడ్డికి దర్గా ముజావర్లు, స్థానికులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దర్గా ప్రధాన మార్గంలోని దుకాణదారులను, స్థానికులను ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం దర్గా వద్ద భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మస్తాన్‌ స్వామివారికి సోమిరెడ్డి దుప్పటి, పూల చాదర్‌ తదితర పూజ సామగ్రిని సమర్పించారు. అనంతరం దర్గా పూజారులు సోమిరెడ్డి పేరిట ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమిరెడ్డి మాట్లాడుతూ కసుమూరు దర్గాకు దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకమైన విశిష్టత, భక్తుల ఆదరణ ఉందన్నారు. ప్రతినిత్యం స్వామి వారిని వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారన్నారు. అంతటి విశిష్టమైన దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎన్‌డిఎ కూటమి నేతలు, కార్యకర్తలు, దర్గా ముజావర్లు, స్థానిక నేతలు తదితరులున్నారు.

➡️