విచ్ఛిన్నకర బిజెపిని ఓడించాలి : ఎమ్మెల్సీ కెఎస్‌

Apr 8,2024 00:20

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి – మంగళగిరి :
విచ్ఛిన్నకర బిజెపిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్‌ అండ్‌ బి బంగ్లా సమీపంలో మధ్యతరగతి ఉద్యోగుల, కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి వివికె సురేష్‌ అధ్యక్షత వహించగా లక్ష్మణరావు మాట్లాడుతూ గత పదేళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసే విధంగా పరిపాలన కొనసాగించారని విమర్శించారు. ప్రతిపక్ష రాజకీయ నాయకులపై కేంద్ర సంస్థలను ఉపయోగించి అరెస్టు చేయించడం పరిపాటైందన్నారు. నియంత పాలనకు పరాకా ష్టకు చేరిందని, బిజెపి లక్ష్యం దేశంలో ఇతర పార్టీలు ఉండకుండా అదొక్కటే ఉండాలని చెప్పారు. సిఎఎను తీసుకువచ్చి ప్రజలను మతాల వారీగా విడదీసేందుకు యత్నిస్తోందని తెలిరిపారు. బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, మధ్య తరగతి వారిపై పన్నులు భారాన్ని పెంచుతున్నారని విమర్శిం చారు. రాష్ట్రంలో గత పదేళ్లలో వైసిపి, టిడిపి ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పటికీ రాష్ట్రానికి ప్రయోజనమేమీ చేకూరలేదని అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం తో అమలు చేయించలేకపోయారని విమర్శిం చారు. రెండు ప్రభుత్వాలు బిజెపికి అనుకూలంగా ఉండి రాష్ట్రానికి తీరని అన్యా యం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండియా వేదిక తరుపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంటు స్థానానికి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగాల అజరు కుమార్‌ను గెలిపించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లా డుతూ ప్రధాని నరేంద్ర మోడీ అసత్యలను, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పోరాటాలను నిరంకు శంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, దేశంలో నియంత పాలన తారాస్థాయికి చేరిం దని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూని స్టుల ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో పెంచుకోవ డానికి కృషి చేయాలని కోరారు. ఎన్నో పోరా టాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వ హయాంలో కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగానికి, లౌకిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతు న్నాయని ఆందోళన వెలిబుచ్చారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహ త్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న టిడిపి, వైసిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి పోయిందని చెప్పారు. పదేళ్లలో రూ.25 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని అన్నారు. ఈ విధానాలు మారాలన్నా, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు బలపడాలన్నా కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకరరావు, నిర్మలా విద్యాసంస్థల డైరెక్టర్‌ వివి ప్రసాద్‌, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, ఎస్‌ఎస్‌ చెంగయ్య పాల్గొన్నారు.

➡️