స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై మోడీ, బాబు వైఖరి అన్యాయం

మాట్లాడుతున్న సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి- పరవాడ

కశింకోట మండలం రాజుపాలెం వద్ద సోమవారం జరిగిన ఎన్‌డిఎ కూటమి ఎన్నికల బహిరంగసభలో దేశ ప్రధాని మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలను మరోసారి మోసం చేశారని సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. వారి ప్రసంగాల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కనీసం పెదవి విప్పకపోవడం అన్యాయమన్నారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, అల్లు రాజు, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్‌ నాయుడు మంగళవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బిజెపి ఎంపీ అభ్యర్ధి రమేష్‌ ప్రధాన మంత్రితో తనకు అత్యంత సాన్నిహిత్యం వుందని, తనను గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేయిస్తానని చెప్పాడని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మేది లేదని మోడీతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది, లేనిది చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పరవాడ ఫార్మా కాలుష్య కోరల్లో ఉన్న తాడి, ఎన్‌టిపిసి కాలుష్యంతో అల్లాడుతున్న మూలస్వయంభవరం, సోమనాయుడుపాలెం గ్రామాల తరలింపుపై ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు.దేవరాపల్లి : రాజుపాలెం వద్ద ఎన్నికల సభలో ప్రధాని మోడీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న మండల కార్యదర్శి బిటి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారు స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌పైనా దొంగ నాటకాలడుతున్నట్లు అర్ధమౌతుందన్నారు. చెరుకు రైతులు గురించి మాట్లాడిన మోడీ ఆ రైతులకు జీవనాధరమైన జిల్లాలోని సుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణపై ప్రస్తావించకపోవడం రైతులను మోసగించడం తప్ప మరొకటి కాదన్నారు. జిల్లాలో ప్రధాన అంశాలేవి ప్రస్తావించకుండా, రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని వాటిని అరికడతామని ఎన్నికల సభల్లో ప్రసంగించడమంటే మత విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి బిజెపి పధకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ప్రజలు అప్రమత్తమై బిజెపి అభ్యర్ధి సిఎం రమేష్‌ను, ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్న పార్టీలను ఓడించడం ద్వారానే దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని, ప్రజాస్వామ్యన్ని, రాజ్యంగాన్ని కాపాడుకోగలమని వారు స్పష్టం చేశారు.

➡️