తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎంపిపి టి.లక్షుమయ్య

Apr 16,2024 14:43 #drinking water problem, #measures, #MPP

ప్రజాశక్తి – చాపాడు (కడప) : గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడగానే వెంటనే పరిష్కరించాలని ఎంపిపి టి.లక్షుమయ్య సూచించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ మండల పరిధిలో గతంలో ఎన్నడు లేని విధంగా తాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. మైలవరం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేయడం వలన పెన్నా తీరంలోని గ్రామాలకు తాగునీటి సమస్య లేదన్నారు. కుందూ, కేసీ కెనాల్‌ పరిధిలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందన్నారు. ముందు జాగ్రత్తతో చేతిపంపులన్నింటికి మరమ్మతులు చేయించామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు అందగానే చర్యలు చేపట్టాలని ఎంపిడిఓ మహబూబ్‌ బీ, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ భరత్‌ కుమార్‌ రెడ్డికి సూచించారు. ఏఈ భరత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను దఅష్టిలో ఉంచుకొని ఏ పార్టీ నాయకులు నూతన బోర్లు వేయడం గానీ ,ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టడం చేయకూడదన్నారు. సమస్య ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో సమస్య పరిష్కరిస్తామన్నారు. చాలావరకు భూగర్భ జలాలు అడుగంటి పోయాయన్నారు. గ్రామపంచాయతీ బోర్లకు నీరు తగ్గిన ప్రాంతాల్లో సమీపంలోని రైతుల బోర్లను రోజుకు రూ. 275కు చెల్లించి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ భూషణం, ఉప మండల అధ్యక్షులు శుభకరుణమ్మ, మండల స్థాయి అధికారులు సర్పంచులు, ఎంపిటిసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️